పొత్తు ఖరారు కాలేదు

5 Mar, 2021 08:24 IST|Sakshi

సాక్షి, చెన్నై: తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు. తమ కూటమి సీఎం అభ్యర్థి కమల్‌ అని, కూటమి ఖరారైనట్టుగా ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ బుధవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పొత్తు ఇంకా ఖరారు కాలేదని కమల్‌ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఎన్నికల వాగ్దానాలుగా తరచూ కమల్‌ కొన్ని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం మహిళలు, యువత, క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఏడు వాగ్దానాలు చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎస్‌ఎంకే, ఐజేకేలతో చేతులు కలిపామేగానీ, పొత్తు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు.

పొత్తులు, పందేరాల విషయంగా చర్చలు సాగాల్సి ఉందన్నారు. మంచి వాళ్లు వస్తే తన కూటమిలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రావాలనుకునే వాళ్లు త్వరగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వెన్నంటి పొన్‌రాజ్‌ ఇటీవల కలాం లక్ష్య ఇండియాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పొన్‌రాజ్‌ మక్కల్‌ నీది మయ్యం కట్చిలో చేరడంతో ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని కమల్‌ అప్పగించడం విశేషం.

ఎవరూ కొనలేరు.. 
మైలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కమల్‌ ప్రసంగిస్తూ అవినీతిపైనే తన యుద్ధమని, అవినీతి పాలకుల్ని తరిమికొట్టడం లక్ష్యంగా, మార్పును ఆశిస్తున్న ప్రజలకు సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. తనను కొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని, వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ డైలాగును తాను గతంలోనే దశవాతారం సినిమాలోనూ ముందే చెప్పినట్టు గుర్తు చేశారు.

తనను ఎవరూ కొనలేరని, తనకు ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ఈ ప్రజల నెత్తిన భారంగా ఉన్న రూ.5.70 లక్షల కోట్లు అప్పును తీర్చడం లక్ష్యం అని వ్యాఖ్యానించారు. అధికార, ధనబలంతో  ఓట్లను కొనవచ్చన్న ధీమా తో తిరిగే వాళ్లు, కొత్తగా తమిళంపై ప్రేమ, మక్కువ ఉన్నట్టు నటించే వాళ్లు, తమిళం మాట్లాడ లేకున్నానే అని ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలోకి వచ్చి వెళ్తున్నారని, వారిని నమ్మితే ఈ రాష్ట్రం అధోగతిపాలు కావడం తథ్యమని కమల్‌హాసన్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు