మూన్‌లైటింగ్‌ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్‌లో.. మరి పగటి పూట!

13 Dec, 2022 06:41 IST|Sakshi

బరంపూర్‌: మూన్‌లైటింగ్‌. ఐటీ రంగంలో ఈ మధ్య బాగా పాపులరైన పదం. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు. ఒడిశాకి చెందిన ఒక లెక్చరర్‌ కూడా మూన్‌లైటింగ్‌ చేస్తున్నారు. కానీ ఈయనది మనసుని కదిలించే కథ.

పొద్దున్న పూట కాలేజీలో విద్యార్థులకు పాఠాలు. రాత్రయ్యే సరికి ఎర్రచొక్కా వేసుకొని రైల్వే స్టేషన్లలో కూలీ అవతారం. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, తాను ఏర్పాటు చేసిన కోచింగ్‌ సెంటర్‌లో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కోసం కూలీ పని చేస్తున్నారు.

ఒడిశాలో గంజామ్‌ జిల్లాకు చెందిన 31 ఏళ్ల సీహెచ్‌.నగేశు పాత్రో బరంపూర్‌ రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేసేవారు. కరోనా సమయంలో రైళ్లు నిలిచిపోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఎంఏ వరకు చదువుకున్న పాత్రో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిరుపేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పదో క్లాసు పిల్లలకి పాఠాలు చెప్పసాగారు.

కోచింగ్‌ సెంటర్‌కి ఆదరణ పెరగడంతో 10 నుంచి 12 వేల జీతానికి కొందరు టీచర్లను నియమించారు. వారికి జీత భత్యాలు ఇవ్వడానికి రాత్రయ్యే సరికి మళ్లీ కూలీ పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాత్రో సూరత్‌లోని ఒక మిల్లులో, హైదరాబాద్‌లోని ఒక మాల్‌లో పని చేసి తాను సంపాదించిన డబ్బులతోనే చదువుకున్నారు. 

మరిన్ని వార్తలు