Red Ant: చీమలు బాబోయ్‌.. చీమలు!..వేధిస్తున్న ఎర్ర రాకాసి చీమలు

5 Sep, 2022 09:12 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: ‘చీమలు బాబోయ్‌ చీమలు. భరించ లేకపోతున్నాం. ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే. మునుపెన్నడూ ఇటువంటి చీమల దండుని చూడనే లేదు’ ఇదీ.. పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్‌ పంచాయతీ బ్రాహ్మణ సాహి గ్రామస్తుల ఆర్తనాదం. ఈ గ్రామంలో చీమలు దండెత్తుతున్నాయి. అక్కడున్న వారిని కాటు కంటే ఘాటుగా కుడుతున్నాయి. చీమ కుట్టిన వారి బతుకు దుర్బరం అవుతుందనే భయాందోళనలతో గ్రామం మార్మోగుతోంది. గత 2 నెలలుగా ఈ వేధింపులు భరించలేక గ్రామం విడిచి పెట్టేందుకు మూటాముల్లె సర్దుకుంటున్నారు.

దీని ప్రభావంతో గ్రామానికి చెందిన కుముద్‌ దాస్‌ కుటుంబం వేరే ఊరికి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ చీమలు మామూలు చీమలు కాదు. ఎర్రటి రాకాసి చీమలు. అసాధారణ పరిమాణంలో దండుగా చొరబడుతున్నాయి. సందు దొరికితే పుట్ట గట్టుకుని బస చేస్తున్నాయి. జోలికిపోతే కుట్టి గాయపరుస్తున్నాయి. ఈ చీమ కుడితే విపరీతమైన దురదతో దద్దర్లు పొక్కి క్రమంగా గాయమైపోతుంది. కుట్టిన చోటు వాచి, కదల్లేని విపరీత పరిస్థితులు ఆవహిస్తున్నాయి. గ్రామంలో ఇంటా బయట చీమల దండు హోరెత్తుతోంది.

గ్రామ శివార్లు కాలువ ప్రాంతం నుంచి చీమల దండు ఆవిర్భవిస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. పొలాలు, రహదారులు, ఇల్లు, వాకిలి, లోపలా, బయట అన్ని చోట్లా గుట్టలుగా పేరుకు పోతున్నాయి. ఇళ్ల మట్టి గోడల్లో చిన్నపాటి సందు కుదిరతే పుట్టగట్టి బస ఏర్పరచుకుంటున్నాయి. గోడల మీద పాకే బల్లి, వాకిట్లో కప్పలు, పిల్లులు వంటి మూగ జీవులను సైతం బతకనీయడం లేదని గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఏం చేయాలో తోచని దయనీయ పరిస్థితుల్లో గ్రామం విడిచి పోయేందుకు గ్రామస్తులు నడుం బిగిస్తున్నారు. 

నిపుణుల అభయం.. 
గ్రామంలో తాండవిస్తున్న చిత్ర విచిత్ర విపత్కర పరిస్థితి నివారించేందుకు చంద్రాదెయిపూర్‌ పంచాయతీ సర్పంచ్‌ రంగంలోకి దిగారు. స్థానిక మండల అభివృద్ధి అధికారి(బీడీఓ)తో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపారు. మండల అధికార యంత్రాంగం చొరవతో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బెంబేలెత్తాల్సిన పరిస్థితి లేదని గ్రామస్తులకు ఈ బృందం భరోసా ఇచ్చారు. ఇంకా నివారణోపాయం స్పష్టం కానందున గ్రామస్తుల మాత్రం ఆందోళన వీడటం లేదు. చీమల జోలికి పోకుండా దూరంగా ఉండటం తాత్కాలిక ముప్పు నివారణోపాయంగా నిపుణుల బృందం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు