పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌.. అక్రమంగా..

30 Jan, 2022 17:33 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): ఉపాధ్యాయుడు శిశిర్‌కుమార్‌ సిమోలి విజిలెన్స్‌ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లపై శనివారం ఆకస్మిక దాడులు చేపట్టిన అధికారులు పలు విలువైన దస్తావేజులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జిల్లాలోని కాశీపూర్‌ సమితి, దొరగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు సంబంధించి, కాశీపూర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అధికారులకు తెలిసింది.

దీంతో విజిలెన్స్‌ డీఎస్పీలు సుశాంత్‌కుమార్‌ బిశ్వాల్, అనంతప్రసాద్‌ మల్లిక్, కళావతి భాగ్‌ల నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. తొలుత దొరగుడ(కాశీపూర్‌ సమితి)లోని ఇంట్లో తనిఖీలు చేపట్టిన సిబ్బంది రూ.2.88 లక్షల నగదు, 1 ఇన్నోవా కారు, మరొక బొలెరొ కారు, 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండంతస్తుల భవనాలు రెండు, మూడంతస్తుల భవనం ఒకటికి సంబంధించిన దస్తావేజులు, రాయగడ స్టేట్‌ బ్యాంక్‌లో జమ చేసిన రూ.21.68 లక్షలకు సంబంధించి, బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు