సుప్రీంలో వాదిస్తున్నారు.. కంప్యూటర్‌ కొనుక్కోలేరా! 

18 Jan, 2022 11:44 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: కేసుల ఆన్‌లైన్‌ విచారణ సందర్భంగా లాయర్ల మొబైల్‌ ఫోన్లతో తరచూ అంతరాయాలు కలగడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే మొబైల్‌ ఫోనుతో కేసుల విచారణలో పాల్గొనడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ హెచ్చరించింది. లాయర్ల మొబైల్‌ ఫోన్లలో ఆడియో, వీడియో లేదా రెండూ సరిగా లేకపోవడంతో సోమవారం లిస్టయిన కేసుల్లోని పది కేసుల విచారణను బెంచ్‌ వాయిదావేయాల్సి వచ్చింది.

దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘న్యాయవాది గారు, మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. వాదనల కోసం కనీసం ఒక డెస్క్‌టాప్‌ను భరించలేరా!’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. మరోకేసులో ఒక లాయర్‌ మొబైల్‌కు ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంపై స్పందిస్తూ ‘ఇలాంటి కేసులను వినే శక్తి ఇక మాకు లేదు. మాకు సరిగా వినపడే డివైజ్‌ను తెచ్చుకోండి. ఇప్పటికే పది కేసుల్లో ఇలాగే మేం గట్టిగా అరవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించింది.  
(చదవండి: ఖద్దరు చొక్కాకై ఖాకీ తహతహ!)

మరిన్ని వార్తలు