పద్మవిభూషణ్‌ వాపస్‌

4 Dec, 2020 02:44 IST|Sakshi

రైతుల ఆందోళన నేపథ్యంలో బాదల్‌ రాజకీయ ఎత్తుగడ

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు.  పంజాబ్‌ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్‌ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్‌ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్‌ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు  ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు.   రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్‌ సింగ్‌ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రకటించారు. కాగా,  శిరోమణి అకాలీ దళ్‌ డెమొక్రటిక్‌ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్‌ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు...
మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా