'అమృత్‌ మహోత్సవ్‌'కు ప్రధాని మోదీ శ్రీకారం

12 Mar, 2021 11:53 IST

గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'అమృత్‌ మహోత్సవ్‌' ప్రారంభం

గుజరాత్‌: 'అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని ప్రధాని.. శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు 'అమృత్‌ మహోత్సవ్‌' నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపనున్నారు.

నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌:
ఈ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేయగా, వరంగల్‌లో గవర్నర్ తమిళిసై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, గాంధీ ఉద్యమం తర్వాత అద్భుత ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయన్నారు. అహింసాయుతమైన పద్ధతిలో గాంధీ పయనించారని తెలిపారు. అహింసా పద్ధతిలోనే స్వాతంత్ర్యం సాధించి, మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

‘‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కు కూడా గాంధీనే ఆదర్శం. గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శం. 384 కి.మీ. 24 రోజులపాటు గాంధీతోపాటు సత్యాగ్రహులు పాదయాత్ర చేశారు.గాంధీ వెంట సుమారు 70వేల మంది పాల్గొన్నారు. దండి యాత్ర ఒక ప్రవాహంలా నడిచింది. దండి యాత్ర స్ఫూర్తితో అమృత్‌ మహోత్సవ్ కొనసాగుతుంది. దండి యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజిని నాయుడు కూడా పాల్గొన్నారు. ఎందరో మహానీయులు ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా గాంధీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అదే స్ఫూర్తితో తెలంగాణను సాధించుకున్నామని’’ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రమణా చారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని సీఎం ప్రకటించారు.

మరిన్ని వార్తలు