చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు భగత్‌ సింగ్‌ పేరు: ప్రధాని మోదీ

25 Sep, 2022 12:53 IST|Sakshi

న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద‍్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార‍్యక్రమం మన్‌ కీ బాత్‌లో వెల్లడించారు.  ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో సెప్టెంబర్‌ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్‌ సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 

మన్‌ కీ బాత్‌లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద‍్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన‍్నారు. టాస్క్‌ఫోర్స్‌ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. 

మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం భగత్‌ సింగ్‌ గ్రామం ఖట్కార్‌ కలాన్‌లోనే నిర్వహించారు. భగత్‌సింగ్‌ ఉపయోగించిన పసుపు టర్బన్స్‌ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్‌ సింగ్‌ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు.

ఇదీ చదవండి: పంజాబ్‌ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్‌ ఓకే

మరిన్ని వార్తలు