రైతుల ఉద్యమం పవిత్రమైనదే.. కానీ: మోదీ

10 Feb, 2021 19:03 IST|Sakshi

ఆందోళన జీవి వ్యాఖ్యలపై స్పందించిన మోదీ

పబ్లిక్‌ రంగంతో పాటు ప్రైవేట్‌ సెక్టార్‌ కూడా ముఖ్యమే

సాక్షి, న్యూఢిల్లీ: రైతులు చేస్తోన్న ఉద్యమం పవిత్రమైనదే కానీ.. ఆందోళన జీవి వల్ల అది దారి తప్పుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌స‌భ‌లో స‌మాధానం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ.. వివిధ అంశాల‌పై సుధీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యంగా రైతుల ఉద్యమానికి సంబంధించి మోదీ చేసిన ఆందోళన జీవి వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో ఆయన దీనిపై స్పందించారు. 

‘‘రైతుల చేస్తోన్న ఉద్యమం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళన జీవులు రైతుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. వారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను.. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని, నక్సల్స్‌ను, ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ఆందోళన జీవులు రైతులకు మేలు చేసే వారు ఎలా అవుతారు’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఆందోళన ముఖ్యం. కాని జనాలు ప్రజాస్వామ్యం, నిజమైన ఆందోళనకారుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. పంజాబ్‌లో మొబైల్ టవర్లను ధ్వంసం చేయడం ఏంటి.. వ్యవసాయ చట్టాలతో దానికి సంబంధం ఏంటి’’ అని మోదీ ప్రశ్నించారు.

ప్రైవేట్‌ రంగం కూడా కీలకమే
‘‘ప్రభుత్వ రంగం అనివార్యమే ఒప్పుకుంటాను. కానీ అదే సమయంలో ప్రైవేట్‌ రంగం కూడా కీలకమే’’ అని ప్రధాని పేర్కొన్నారు. టెలికాం, ఫార్మా సహా ఏ రంగం తీసుకున్నా ప్రైవేట్‌ రంగం పాత్ర విస్మరించలేమని తెలిపారు. ప్రైవేట్‌ రంగాన్ని కించపరుస్తూ మాట్లాడే సంస్కృతికి కాలం చెల్లిందన్నారు. గతంలో ప్రైవేట్‌ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని పార్టీలకు ఓట్లు పడేవి. కానీ ఇప్పుడా రోజులకు కాలం చెల్లిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులతో సేద్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని మోదీ స్పష్టం చేశారు. 

చదవండి: ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్‌
                 హలధారులే కానీ.. హంతకులు కారు

మరిన్ని వార్తలు