ఇకపై ఆ ప్రాంతాన్ని ‘శివశక్తి’గా పిలుచుకుందాం

27 Aug, 2023 05:45 IST|Sakshi
చంద్రయాన్‌–3 మిషన్‌ను విజయవంతం చేసిన మహిళా శాస్త్రవేత్తలతో శనివారం బెంగళూరులోని ఇస్రో సెంటర్‌లో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

చంద్రుడిపై ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి నామకరణం చేసిన మోదీ

ఆగస్ట్‌ 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటిద్దామని పిలుపు

శివాజీనగర: చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌–3 ల్యాండర్‌ దిగిన ప్రాంతం ఇకపై ‘శివశక్తి’ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్‌ జరిగిన రోజు(ఆగస్ట్‌ 23వ తేదీ)ను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏథెన్స్‌ నుంచి తిరుగు పయనమైన మోదీ శనివారం బెంగళూరుకు చేరుకున్నారు.

చంద్రయాన్‌–3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌లో ఇస్రో శాస్తవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు. ‘ భారత అంతరిక్ష ప్రయోగాల పథాన్ని ఈ విజయం నిజంగా అసాధారణమైన ఆనందంతో నింపేసింది. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా, 2019లో చంద్రయాన్‌–2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలుచుకుందాం.

శివశక్తిలోని శివ.. మానవత్వం శ్రేయస్సుకు ప్రతీక. శక్తి.. మానవాళి సంక్షేమ ఆకాంక్షలకు తగిన ధైర్యం, స్థైర్యాన్ని అందిస్తుంది. అందుకే ఆ ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేశా’ అని అన్నారు.  ‘భారతీయ గ్రంథాల్లోని ఖగోళ సూత్రాలను శాస్త్రీయంగా రుజువుచేసేందుకు నవతరం ముందుకు రావాలి. వాటిని అధ్యయనం చేయాలి. ఇది మన వారసత్వానికి, శాస్త్రానికి ఎంతో ముఖ్యం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులపై ఇందుకు సంబంధించి రెట్టింపు బాధ్యత ఉంది. వందల ఏళ్ల బానిసత్వం కారణంగా భారత ఉజ్వల శాస్త్రీయ విజ్ఞానం మరుగునపడింది. ‘ఆజాదీ కా అమృత్‌’ కాలంలో ఆ విజ్ఞాన నిధిని మళ్లీ వెలికితీసి ప్రపంచానికి చాటి చెప్పాలి’ అని మోదీ అభిలషించారు.

ఇబ్బంది పడొద్దనే సీఎం, గవర్నర్‌లను వద్దన్నా
మొదట బెంగళూరు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి కాన్వాయ్‌లో ప్రజలకు చేతులు ఊపుతూ మినీ రోడ్‌షో నిర్వహించారు. అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి రాలేదు. ఇందుకు కారణాన్ని మోదీనే వివరించారు. ‘ గ్రీస్‌ నుంచి సుదూర ప్రయాణం కారణంగా సరిగ్గా ఎన్ని గంటలకు విమానం ల్యాండ్‌ అవుతుందో తెలీదు. గవర్నర్‌ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డెప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నాకోసం అనవసరంగా చాలా సేపు వేచిఉండాల్సి రావొచ్చు.

అందుకే స్వాగతం పలికేందుకు రావద్ద ని ముందే తెలియజేశా’ అని మోదీ స్పష్టత నిచ్చారు. కాగా, మోదీ వివరణపై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. ‘మోదీ కంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం, డెప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు. అది మోదీకి సుతరాము నచ్చలే దు. అందుకే ఈసారి ఆయన వచ్చినపుడు సీఎంను రావొద్దని చెప్పారు’ అని ఆరోపించారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్న మోదీ పాలెం ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలికిన బీజేపీ చీఫ్‌ నడ్డా, పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ‘చంద్రయాన్‌ విజయంతో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని.. యువతరంలో శాస్త్రాయ విజ్ఞానంపై మక్కువ పెంచేందుకు ఉపయోగించాలి. అప్పుడే 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ అనే కల నెరవేరుతుంది’ అని అన్నారు.

జై విజ్ఞాన్‌.. జై అనుసంధాన్‌
‘చంద్రయాన్‌–3 విజయం తర్వాత ఇక్కడికొచ్చేందుకు, మిమ్మల్ని అభినందించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. పని పట్ల మీ అంకితభావం, నిబద్ధత, ధైర్యసాహసాలు, తెగువకు నా సెల్యూట్‌’ అని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘చందమామను భారత్‌ చేరుకుంది. ల్యాండర్, రోవర్‌ రూపంలో మన జాతి గౌరవం చంద్రుడిపై సగర్వంగా అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న మహిళా శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నా. దేశ నారీశక్తి ఈ ప్రాజెక్టులో పెద్దపాత్ర పోషించింది. మనోధైర్యం ఉంటే విజయం గ్యారెంటీ. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల నుంచి స్ఫూర్తి పొందేందుకు ఆగస్ట్‌ 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినంగా జరుపుకుందాం’ అని మోదీ అన్నారు.

‘జై విజ్ఞాన్‌...జై అనుసంధాన్‌ అనే నినాదం ఇచ్చారు. ‘విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగిన సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నాను. అయినా నా మనస్సు, ఆలోచన మొత్తం ఇక్కడే ఉన్నాయి. అందుకే గ్రీస్‌ దేశం నుంచి మిమ్మల్ని కలవడానికే నేరుగా ఇక్కడికొచ్చా. ఇప్పటి వరకు భారత్‌లోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేది. ఇకపై చంద్రునిపైనా త్రివర్ణ పతాకం వెలుగులీనుతుంది. ప్రస్తుతం సాధించిన అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలి. ఆ ఫలితాలు కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఉపయోగపడాలి’ అని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు