పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం

22 May, 2023 05:24 IST|Sakshi

28న ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు కొత్త భవనం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. త్రిభుజాకృతిలో నిర్మించిన ఈ భవనం దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూనే ఆధునిక హంగుల కలబోతగా కూడా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28 ఆదివారం కొత్త భవనాన్ని  ప్రారంభించనున్నారు. వందేళ్ల నాటి పాత పార్లమెంటు భవనం నేటి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో కొత్త భవన నిర్మాణం అవసరమైంది. సెంట్రల్‌ విస్టా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కేవలం రెండున్నరేళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌ నేతృత్వంలో నిర్మాణం సాగింది. ప్రస్తుతం పార్లమెంటు పక్కనే నిర్మించిన కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, కమిటీ రూములు, సెంట్రల్‌ హాలు, అతి పెద్ద లైబ్రరీ, విశాలమైన పార్కింగ్‌ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి.

► రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు.
► లోక్‌సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్‌తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. సభ్యుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రస్తుత లోక్‌సభ హాలు కంటే మూడు రెట్లు పెద్దగా రూపొందించారు. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు కూడా చక్కగా సరిపోతుంది. 1,272 మంది సందర్శకులు సమావేశాలను తిలకించవచ్చు.
► రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్‌తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లున్నాయి.
► పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.
► అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్‌ను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది.
► రాజస్తాన్‌కు చెందిన ధోల్‌పూర్‌ రాళ్లతో భవనానికి అద్భుతమైన లుక్‌ వచ్చింది.
► పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్‌ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళారూపాలతో రూపొందాయి.
► భవన నిర్మాణంలో అడుగడుగునా పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేశారు. గ్రీన్‌ ఎనర్జీతో 30% దాకా విద్యుత్‌ ఆదా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుందట.
► పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది.
► భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు.
► ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు.
► దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం జరిగింది.
► భవనం గోడలపై పలు శ్లోకాలను రాశారు.


చరిత్రలోకి తొంగి చూస్తే..
ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్‌ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్‌ ల్యూటెన్స్, హెర్బర్ట్‌ బేకర్‌ దీన్ని డిజైన్‌ చేశారు. 1921 నుంచి ఆరేళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షలు ఖర్చు అయింది. 1927 జనవరి 18న గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని ప్రారంభించారు. దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు.  

ఎందుకీ నిర్మాణం?
ప్రస్తుత పార్లమెంటు భవనం అవసరాలు తీర్చేలా లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సభ్యుల సంఖ్య పెరిగితే సరిపోదు. మంత్రులు, మీటింగ్‌ హాల్స్‌ కొరత ఉంది. భవనంలో మార్పులు చేర్పులు చేస్తే నిర్మాణం దెబ్బ తినే ప్రమాదముంది. దానికి భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. ఢిల్లీ ఏమో అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్‌–4లో ఉంది. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఆధునిక సౌకర్యాలూ లేవు.

రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్‌
న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే తప్ప ప్రధాని కాదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగపరంగా సరైంది కాదంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ కూడా ట్వీట్లు చేశారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ప్రకారం లోక్‌సభ, రాజ్యసభలతో కూడిన పార్లమెంటుకు రాష్ట్రపతే అధిపతి గనుక నూతన భవనాన్ని ఆయనే ప్రారంభించాలన్నారు. ఆర్‌జేడీ, ఎంఐఎం కూడా ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక హిందూత్వవాది వి.డి. సావర్కర్‌ జయంతి నాడే (ఈ నెల 28న) ప్రారంభోత్సవం జరపనుండటాన్నీ విపక్షాలు తీవ్రంఆక్షేపిస్తున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

మరిన్ని వార్తలు