వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి

8 Nov, 2021 06:16 IST|Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు.

వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్‌ చంపారన్‌లోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు.

మరిన్ని వార్తలు