Amarinder Singh: కెప్టెన్‌ కథ కంచికి చేరిందిలా!

19 Sep, 2021 04:53 IST|Sakshi

ఒకప్పుడు పంజాబ్‌ కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించిన సింగ్‌ సాబ్‌ చివరకు అవమానకరంగా నిష్క్రమించారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు అమరీందర్‌ రాజీనామాకు కూడా చాలా కారణాలున్నాయి. కానీ ఎన్ని కారణాలున్నా, పట్టుమని ఎన్నికలకు 5 నెలల సమయం కూడా లేని ఈ సమయంలో అమరీందర్‌ను తొలగిస్తారని చాలామంది ఊహించలేదు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.   

రాబోయే ఎన్నికల్లో గెలిచి పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్, పునర్వైభవం దక్కించుకోవాలని ఆకాళీదళ్, ఒంటరిగా సత్తా చూపాలని బీజేపీ.. మల్లగుల్లాలు పడుతుంటే, ఇవేమీ పట్టనట్లుగా ఉన్నట్లుండి సీఎంను మార్చాలని కాంగ్రెస్‌ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో తప్పక ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెప్పాయి. పంజాబ్‌ రాజకీయాలు తెలిసి కూడా కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకోవడం దుస్సాహసమేనని రాజకీయ పండితుల అభిప్రాయం. మరి ఉన్నట్లుండి అమరీందర్‌ను తొలగించారా? కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ఇందుకోసం ప్రేరేపించిన అంశాలేంటి? అనేవి శేష ప్రశ్నలు. వీటికి సమాధానంగా కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఇలా ఉన్నాయి...

మసకబారుతున్న ప్రభ: సంవత్సరాలుగా పంజాబ్‌ కాంగ్రెస్‌లో ఎదురులేని నేతగా ఉన్న అమరీందర్‌ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని కొన్ని సర్వేలు ఎత్తి చూపాయి. ఉదాహరణకు 2019లో ఆయన రేటింగ్‌ 19శాతం ఉండగా, 2021 ఆరంభంలో 9.8శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ సొంతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కూడా కెపె్టన్‌ పట్ల ప్రతికూలత కనిపించినట్లు సమాచారం.

డ్రగ్‌ మాఫియా: పంజాబ్‌ యువతను పీలి్చపిప్పి చేస్తున్న డ్రగ్‌ మాఫియాపై అమరీందర్‌ ఉక్కుపాదం మోపుతారని, ఆయన గురు గ్రంధ్‌ సాహిబ్‌పై ప్రమాణం చేయగానే అంతా ఆశించారు. కానీ గత ప్రభుత్వ హయంలో లాగానే డ్రగ్స్, ఇసుక మాఫి యాపై ఎలాంటి తీవ్ర చర్యలు కెప్టెన్‌ తీసుకోలేదు.  

బాదల్స్‌తో సంబంధాలు: 2015లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో గొడవలకు బాదల్స్‌ కారణమని ప్రజలు భావించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశించారు. కానీ బాదల్స్‌పై ఆరోపణలను హైకోర్టు తోసిపుచి్చంది. దీంతో కెప్టెన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలింది. పైగా సిక్కు యువత ఎక్కువగా ఉపా కేసుల్లో అరెస్టు కావడం అమరీందర్‌కు ప్రతికూలించింది.  

నెరవేరని ఆశలు: ఎన్నికల హామీల్లో కీలకమైన ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటివాటిని అమరీందర్‌ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పెద్దల పింఛను సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వచ్చాయి.  

ఆందోళనలు: అమరీందర్‌ పదవీ కాలంలో రాష్ట్రంలో పలు విషయాలపై ఆందోళనలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారా టీచర్లు, రైతులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, దళితులు.. ఇలా అనేక వర్గాలు వారి బాధలు తీరడంలేదంటూ ఆందోళనలు ముమ్మరం చేశాయి. రైతు ఆందోళనలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయన్న కెప్టెన్‌ వ్యాఖ్యలు ఆయనపై విముఖత పెంచాయి.  

అందుబాటులో ఉండరు: అమరీందర్‌ అందుబాటులో ఉండరనేది ఆయనపై ఎంఎల్‌ఏల ఆరోపణ. ఎక్కువగా మొహాలీ ఫామ్‌హౌస్‌లో ఉంటారని, ప్రజలను, పారీ్టనేతలను కలవరని, అధికారులపై అతిగా ఆధారపడతారని చాలామందిలో అసంతృప్తి ఉంది.  

సిద్ధూ బ్యాటింగ్‌: గతంలో కూడా అమరీందర్‌పై పార్టీలో అసంతృప్తులుండేవారు. కానీ వారి గొంతు పెద్దగా వినిపించేది కాదు. ఈసారి సిద్ధూ రూపంలో కెపె్టన్‌కు అతిపెద్ద అసమ్మతి ఎదురైంది. ఇతర అసంతృప్తి నేతల అండ దొరకటం, మంత్రి పదవి పోవటంతో  సిద్దూ చూపంతా అమరీందర్‌ను దింపడంపైనే ఉంది. చివరకు తన బ్యాటింగ్‌ ఫలించి కెపె్టన్‌ ఇంటిబాట పట్టారు.  

కానీ అంతమాత్రాన కెప్టెన్‌ను తక్కువగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆయన మద్దతుదారులు  రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారన్నది పంజాబ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితిని డిసైడ్‌ చేస్తుందని విశ్లేషకుల భావన.  

 – నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు