మెహబూబా నిర్బంధంపై రాహుల్‌ ఫైర్‌

2 Aug, 2020 16:27 IST|Sakshi

రాహుల్‌ విమర్శలకు కేంద్ర మంత్రి కౌంటర్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద పీడీపీ చీఫ్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని అధికారులు పొడిగించిన క్రమంలో రాజకీయ నేతలను అక్రమంగా నిర్బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత గత ఏడాది ఆగస్ట్‌ 5 నుంచి మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు. మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్ము కశ్మీర్‌ అధికారులు మరో మూడు నెలలు పొడిగించారు. గృహ నిర్బంధం నుంచి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని కోరుతూ రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. మరోవైపు మెహబూబా నిర్బంధం పొడిగింపును కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం తప్పుపట్టారు.

ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను నిరాకరించడమేనని అన్నారు. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, 61 సంవత్సరాల మహిళ ప్రజా భద్రతకు ఎలా ముప్పుగా పరిణమించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధంపై రాహుల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌కు చురక​లు వేశారు. కాంగ్రెస్‌ హయాంలో షేక్‌ అబ్ధుల్లాను ఎలా నిర్బంధించారో రాహుల్‌కు ఎవరైనా గుర్తుచేయాలని కోరారు. గతంలో రాహుల్‌ ముత్తాత, అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ  2000 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులో షేక్‌ అబ్దుల్లాను 12 ఏళ్ల పాటు హౌస్‌ అరెస్ట్‌ చేసిన సంగతి కాంగ్రెస్‌ నేతకు ఎవరైనా చెప్పాలని జితేంద్ర సింగ్‌ చురకలు వేశారు.

చదవండి : ‘అప్పుడు వాజ్‌పేయిని, అడ్వాణీని విమర్శించలేదు’

మరిన్ని వార్తలు