ప్రధానే క్షమాపణ కోరారు..పరిహారం ఎందుకివ్వరు?

8 Dec, 2021 05:04 IST|Sakshi

ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారంపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్‌ గాంధీ                     ఆ రైతుల జాబితాను సభ ముందుంచిన కాంగ్రెస్‌ నేత     

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలపై పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం ఇవ్వాల్సిందేనని రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో పట్టుబట్టారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో రైతులు, సాగు చట్టాల అంశాన్ని రాహుల్‌ లేవనెత్తారు. ఏడాదికాలంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో, ఉద్యమంలో మరణించిన రైతుల జాబితా లేదు అని ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని రాహుల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘దాదాపు 700 మంది రైతులు మరణించారు. తప్పును ఒప్పుకుని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అలాంటప్పుడు రైతులకు పరిహారం మాత్రం ఎందుకు ఇవ్వరు?’అని రాహుల్‌ నిలదీశారు. ‘దాదాపు 400 మంది రైతుల కుటుంబాలకు పంజాబ్‌ ప్రభుత్వం తలా రూ.5లక్షల పరిహారం అందజేసింది. వీరిలో 152 మందికి ఉద్యోగాలిచ్చారు. హరియాణాలో మరణించిన 70 మంది రైతుల జాబితా సైతం నా వద్ద ఉంది’అంటూ మరణించిన రైతుల జాబితాను రాహుల్‌ లోక్‌సభ ముందుంచారు.  

కొలీజియం నియామకాలు ఏమేరకు ప్రభావవంతం? 
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో లెక్కకు మిక్కిలి కేసులు పోగుబడుతున్నాయని, కొలీజియం ద్వారా న్యాయమూర్తుల నియామకాల విధానం ఏ మేరకు ప్రభావవంతంగా ఉందని పలువురు ఎంపీలు ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల(జీతభత్యాలు, సర్వీస్‌ నిబంధనల) సవరణ బిల్లు–2021పై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో పలువురు పాల్గొన్నారు. రెండు హైకోర్టుల ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను సైతం సుప్రీంకోర్టు ఏకపక్షంగా తప్పుబట్టి కొట్టేస్తున్న ఉదంతాల నేపథ్యంలో కొలీజియం వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సమీక్షించాల్సి ఉందని, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ)ని తీసుకురావాలని బిజూ జనతాదళ్‌ ఎంపీ పినాకి మిశ్రా అభిప్రాయపడ్డారు. మిశ్రా అభిప్రాయంతో బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ఏకీభవించారు. షెడ్యూల్‌ కులాల నుంచి న్యాయమూర్తులు అవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ అన్నారు. కోవిడ్‌ కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు వలస కార్మికుల వెతలపై పెద్దగా సానుభూతి చూపలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఈ క్రమంలో కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల విభజనను అతిక్రమించేటట్లుగా పలు కోర్టుల తీర్పులు వెలువడ్డాయన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన కేసుల్లో న్యాయవ్యవస్థపై పాలనా వ్యవస్థ ఒత్తిడి పెరగడం ఆందోళనకరమన్నారు. 

పలు మార్లు రాజ్యసభ వాయిదా 
12 మంది ఎంపీల సస్పెన్షన్‌ సెగ రాజ్యసభను మళ్లీ తాకింది. సభ మొదలవగానే విపక్ష సభ్యులు నినాదాలతో సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. నిరసనల నడుమే ఆరోగ్య మంత్రి సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆందోళనలతో సభ రెండు సార్లు వాయిదాపడి మూడింటికి మొదలైంది. అప్పుడు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌.. సదరు ఎంపీలు బేషరతుగా క్షమాపణలు చెప్తే సస్పెండ్‌ను రద్దుచేస్తామన్నారు. అయినా, ఆందోళనలు ఆగకపోవడంతో సభను మొత్తానికే వాయిదావేశారు.

     

మరిన్ని వార్తలు