మళ్లీ ఈడీ ముందుకు రాహుల్‌

21 Jun, 2022 05:48 IST|Sakshi

ఉదయం నుంచి రాత్రి దాకా ప్రశ్నలు

నేడు కూడా రావాలని ఆదేశం

ఇప్పటికి 38 గంటల విచారణ

23న సోనియాకూ పిలుపు

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ వార్తా పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ (52) సోమవారం నాలుగో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 3.15 దాకా, లంచ్‌ బ్రేక్‌ తర్వాత 4.45 నుంచి రాత్రి దాకా పలు అంశాలపై ఈడీ ఆయనను లోతుగా ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. జూన్‌ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే.

16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్క రోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియాగాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ నిరసనల నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవడం తెలిసిందే. యంగ్‌ ఇండియన్, ఏజేఎల్, నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాల్లో రాహుల్‌ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఫిర్యాదు
అగ్నిపథ్‌ పథకాన్ని, రాహుల్‌ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ వరుసగా రెండో రోజు సత్యాగ్రహం కొనసాగించింది. పార్టీ సీనియర్లు అధీర్‌ రంజన్‌ చౌదరి, మల్లికార్జున్‌ ఖర్గే, అశోక్‌ గహ్లోత్, భూపేష్‌ బఘేల్, సచిన్‌ పైలట్, సల్మాన్‌ ఖుర్షీద్, కేసీ వేణుగోపాల్, భూపీందర్‌ హుడా, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు పాల్గొన్నారు. అగ్నిపథ్‌పై తొలుత పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ను ఈడీ విచారణ పేరిట వేధిస్తున్నారని విమర్శించారు. అనంతరం నేతలంతా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. తాము జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేస్తుండగాపోలీసులు అనుచితంగా ప్రవర్తించారని  ఫిర్యాదు చేశారు. అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనేలా చూడాలని అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేతపై దాడి.. హెల్త్‌ కండీషన్‌ సీరియస్‌

మరిన్ని వార్తలు