Women's Legal Marriage Age: పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?

17 Dec, 2021 13:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అమ్మాయిల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు  త్వరలోనే చట్ట సవరణను తీసుకురానుంది. అయితే  ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాలికల ఉన్నత విద్యకు దోహదపడుతుందని, మహిళల ఆరోగ్యానికి, సంక్షేమానికి దారి తీస్తుందని భావిస్తున్నారు.  అయితే దీనికి భిన్నంగా మరికొంతమంది కూడా వాదిస్తున్నారు.

భారతదేశంలో, చట్టబద్ధమైన వివాహ వయస్సు ప్రస్తుతం బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉంది. అయితే చాలామంది అమ్మాయిలకు 18 ఏళ్ల కంటే ముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. చిన్న తనంలోనే గర్భం దాల్చడం, అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.  ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వెంటనే లేదా అంతకుముందే ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే చిన్నతనంలోనే బరువు బాధ్యతలను భుజాన కెత్తుకోవడంతో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుందనీ, తల్లి పిల్లల ఆరోగ్యానికి ఇదొక వరం అని పేర్కొంది. అలాగే తమ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం వలన ఉన్నత చదువులు చదువు కోవాలన్న తమ కల సాకారం కావడంలేదని  వాపోతున్న బాలికలు చాలామందే ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 15-19 సంవత్సరాల వయస్సు బాలికల మరణాలకు చిన్న వయసులోనే  గర్భం, ప్రసవ సమస్యలు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. 20-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కంటే 10-19 సంవత్సరాల వయస్సు గల తల్లులు ఎక్లాంప్సియా, ప్రసవ ఎండోమెట్రిటిస్, ఇతర ఇన్ఫెక్షన్ల లాంటి  ప్రమాదాలను ఎదుర్కొంటారు. వివాహం ఆలస్యం చేయడం వల్ల పిల్లలకు కూడా మేలు జరుగుతుందని, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టడం, తీవ్రమైన నియోనాటల్ ప్రమాదం తగ్గుతుందని  చెబుతోంది. 

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. 21 ఏళ్ల లోపు అన్ని వివాహాలను చెల్లుబాటుకావు అని ప్రకటిస్తే మరింత ముప్పే అంటున్నారు. ఆడపిల్లల చదువుకు, అనారోగ్యానికి అసలు సమస్యల్ని గుర్తించి, వాటికి సరైన పరిష్కారాల్ని అన్వేషించకుండా చట్టబద్ధంగా పెళ్లిని వాయిదా వేయడంపై ఫెమినిస్టులు, ఇతర మహిళా ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇది మార్గం కాదని వాదిస్తున్నారు. సీపీఎం నాయకురాలు కవితా కృష్ణన్‌ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.  ఇది మహిళల స్వయంప్రతిపత్తిని మరింత దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.

ఆరోగ్య సంరక్షణ, విద్యకు సరైన ప్రాప్యత లేని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ-ఆదాయ కుటుంబాలలో ముందస్తు వివాహాలు ఎక్కువగా జరుగుతాయని సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్‌ పరిశోధకురాలు మేరీ ఇ. జాన్ చెప్పారు. పట్టణాలతో పోలిస్తే , గ్రామీణ స్త్రీలు, యువతులు ఎక్కువ పోషకాహార లోపంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కీలక అంశం పేదరికమే తప్ప, వయస్సు కాదన్నారు. సంపద, విద్య వంటి సామాజిక-పర్యావరణ కారకాలు నియంత్రించ గలిగినపుడు కౌమారదశలోని తల్లులు మరణాల రేటు కూడా నియంత్రణలో ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. 

18 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతి రక్తహీనతతో బాధపడితే, సరైన చికిత్స లేకపోతే, 21 సంవత్సరాల వయస్సులో కూడా అదే రక్తహీనతతో బాధపడతారన్నారు. పేదరికం, ఆరోగ్య రక్షణ లేనపుడు వివాహ వయస్సును కొన్ని సంవత్సరాలు పెంచడంవల్ల ప్రయోజనం అంతంతమాత్రమే అనేది వారి వాదన. అంతేకాదు ఈ నిర్ణయం కొత్త సమస్యలను సృష్టించవచ్చు. యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడంలో మరిన్ని ఇబ్బందులు,  యువతుల వ్యక్తిగత జీవితాల్లో తల్లిదండ్రుల పట్టును మరింత పెరుగుందనే మరో అభిప్రాయం. ముఖ్యంగా ప్రేమ కోసం వివాహం చేసుకునే కులాంతర, మతాంతర జంటలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, కుటుంబ సభ్యుల నుండి హింస బెదిరింపులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి వేధింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ నుండి తప్పించుకోవాలనే  ఉద్దేశంతో వివాహం చేసుకోవడానికి 18 ఏళ్లు నిండకముందే ఇంటి నుండి పారిపోయే జంటలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారి తీస్తుంది. పెళ్ళి వయసు పెంచినంత మాత్రాన బాల్య వివాహాలు ఆగిపోతాయనేది భ్రమ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల చులకన భావం పోవాలి. బాలికల మీద వివక్ష, ఆడ,మగ బిడ్డలమధ్య తారతమ్యాలు పూర్తిగా సమసిపోయేలా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఆర్థిక స్వాతంత్ర్యంతో ఎదిగేలా తల్లితండ్రులు ప్రోత్సాహాన్నందించాలి. రెండవ తరగతి పౌరురాలిగా కాకుండా మహిళలకు, యువతులకు చట్టబద్ధమైన అన్ని హక్కులు అమలు అయినపుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యం అనేది  పలువురి వాదన.

మరిన్ని వార్తలు