రాజస్తాన్‌లో 75% పోలింగ్‌

26 Nov, 2023 05:12 IST|Sakshi
వసుంధరా రాజె, సచిన్‌ పైలట్‌, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌

చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

జైపూర్‌: రాజస్తాన్‌ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్‌ బూత్‌ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్‌ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ప్రవీణ్‌ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్‌ నమోదైంది.

ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్‌ను ఎన్నికల కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్‌ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు.

సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్‌గఢ్, ధోల్‌పూర్‌ జిల్లాల్లో భారీ పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్‌ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్‌ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్, కైలాశ్‌ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్‌ జోథ్‌పూర్‌లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్‌లో, పైలట్‌ జైపూర్‌లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న ఉంటుంది.

స్వల్ప ఘటనలు..
దీగ్‌ జిల్లా కమన్‌ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్‌ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్‌ జిల్లా ఎస్‌పీ చెప్పారు. సికార్‌ జిల్లా ఫతేపూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్‌పీ చెప్పారు. ధోల్‌పూర్‌ బారి నియోజకవర్గంలోని ఓ బూత్‌ వద్ద పోలింగ్‌ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్‌ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారు. టోంక్‌ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్‌పీ రాజశ్రీ రాజ్‌ చెప్పారు.

సుమేర్‌పూర్‌ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్‌ శాంతి లాల్, ఉదయ్‌పూర్‌లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్‌ బూత్‌ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్‌ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్‌లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్‌ బూత్‌ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు