అమెరికాకు తలైవా?

3 Jan, 2021 10:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : రాజకీయ పార్టీ ఏర్పాటు లేదని ప్రకటించిన తలైవా రజనీకాంత్‌ వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదిగో రాజకీయం, ఇదిగో పార్టీ అంటూ ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్‌ ఎట్టకేలకు గత ఏడాది చివర్లో వెనక్కి తగ్గారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా, పార్టీ ఏర్పాటు లేదన్న ప్రకటనను చేశారు. అభిమానులకు ఇది నిరాశే అయినా, తలైవా ఆరోగ్యం తమకు ముఖ్యం అని ప్రకటించిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తలైవా మద్దతు తమ కంటే తమకు దక్కుతుందన్న ఆశాభావంతో రోజుకో ప్రకటనలు చేసే పార్టీల వాళ్లు పెరిగారు. రజనీని కలుస్తామని, మద్దతు కోరుతామని వ్యాఖ్యలు చేసే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ మద్దతు, భేటీల వ్యవహారాలను దాటవేయడానికి సిద్ధమైనట్టు సమాచారు. ఇందులో భాగంగా అమెరికా పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వైద్యపరమైన చికిత్సలు, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కొంతకాలం అమెరికాలో ఉండేందుకు రజనీ నిర్ణయించినట్టు, కుటుంబసభ్యులు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరు వరకు విదేశాల్లో ఉండి, ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చేందుకు తగ్గట్టుగా పర్యటన ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది.  

అళగిరి నిర్ణయం ఎమిటో.. 
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఆదివారం రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయబోతున్నారు. రజనీకాంత్‌ పార్టీ ఏర్పాటు చేసిన పక్షంలో ఆయనతో కలిసి నడవడం లేదా, కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా జత కట్టడం దిశగా అళగిరి వ్యూహాలు ఉన్నట్టు ఇది వరకు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ లేదని రజనీ ప్రకటనతో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు అళగిరి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆది వారం మదురైలో మద్దతుదారులతో భేటీకానున్నారు. పది వేల మంది మద్దతు నేతలు తరలి వస్తారన్న ఆశాభావంతో ఏర్పాట్లు జరిగాయి. వీరి అభిప్రాయాలు, సూచనల మేరకు అళగిరి రాజకీయ ప్రకటన ఉండబోతున్నది. డీఎంకేను చీల్చే రీతిలో కలైంజర్‌ డీఎంకేను ఏర్పాటు చేస్తారా లేదా, మరేదేని కీలక నిర్ణయాన్ని అళగిరి తీసుకుంటారా అనే ఎదురుచూపులు పెరిగాయి.  

మరిన్ని వార్తలు