ఎల్‌ఏసీని గౌరవించాలి

6 Sep, 2020 04:12 IST|Sakshi
మాస్కోలో చైనా రక్షణమంత్రితో చర్చలు జరుపుతున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు వద్దు

బలగాలను ఉపసంహరించుకోవాలి

చైనాకు రాజ్‌నాథ్‌ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. భారత్‌ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్‌ సిద్ధంగా లేదని చెప్పారు.

శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉభయులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది.

సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రాజ్‌నాథ్‌ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్‌.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్‌ఏసీ వెంబడి గల్వాన్‌ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్‌ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్‌ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

రెచ్చగొట్టే చర్యలొద్దు: చైనా
వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ  తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది.  వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది.

ఉద్రిక్తత నివారణకు సాయం చేస్తా: ట్రంప్‌
వాషింగ్టన్‌: భారత్‌–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. అక్కడి పరిస్థితి ‘చాలా అసహ్యంగా’ ఉందని అభివర్ణించారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, అవసరమైతే వివాద పరిష్కారానికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్‌ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై భారత్, చైనాలతో మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సమయంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా