నీట్‌ పరీక్ష: రాజకీయాలకు తావులేదు

27 Aug, 2020 18:48 IST|Sakshi

ఎన్‌టీఏ మార్గదర్వకాలకు అనుగణంగా పరీక్షలు : కేంద్ర మంత్రి

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్‌ తమకు ప్రధానమని, ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు. మే-జూన్‌ నుంచి ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయని, పెద్దసంఖ్యలో విద్యార్ధులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణకు సానుకూలంగా స్పందించారని, మెయిల్స్‌ ఇతర మార్గాల ద్వారా తమ సమ్మతి తెలిపారని మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుగుణంగా పరీక్షా కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేసిందని చెప్పారు. 99 శాతం విద్యార్ధులు వారు ఎన్నుకున్న కేంద్రంలోనే పరీక్షకు హాజరవుతారని, ఎలాంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై రాజకీయాలకు తావులేదని అన్నారు.

అన్ని వాదనలు విన్నమీదట సుప్రీంకోర్టు సైతం విద్యార్ధుల విద్యా సంవత్సరాన్ని మనం వృధా చేయరాదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇక ఈ పరీక్షలకు హాజరవుతున్న 8.58 లక్షల విద్యార్ధుల్లో 7.50 లక్షల మంది విద్యార్ధులు తమ జేఈఈ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లౌడ్‌ చేసుకోగా, నీట్‌ పరీక్షలకు హాజరయ్యే 15.97 లక్షల మంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది విద్యార్ధులు అడ్మిట్‌ కార్డులను ఇప్పటివరకూ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

నీట్‌-జేఈఈ పరీక్షలకు ఎన్‌టీఏ జారీ చేసిన మార్గదర్శకాల అమలు చేస్తూ విద్యార్ధు భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. ఎన్‌టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా శాఖ కార్యదర్శి సైతం రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఇక జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ నుంచి బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ వరకూ పలువురు ప్రముఖులు కరోనా విజృంభిస్తున్న సమయంలో నీట్‌ పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. చదవండి : జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బె‌ర్గ్

మరిన్ని వార్తలు