Hijab Row: లాజిక్ లేకుండా మాట్లాడొద్దు.. హిజాబ్ వాదనలపై సు‍ప్రీం అసహనం

7 Sep, 2022 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలల్లో హిజాద్ నిషేధంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదికి కోర్టుకు మధ్య వాదోపవాదనలు వాడివేడిగా సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం కూడా ఓ హక్కు అని న్యాయవాది దేవ్‌దత్‌ కమాత్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా.. అహేతుకంగా మాట్లాడవద్దని న్యాయవాది దేవ్‌దత్‌కు సూచించారు. ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? అని ప్రశ్నించారు. దీనికి దేవ్‌దత్‌ స్పందిస్తూ స్కూళ్లలో ఎవరూ దుస్తులు తీసేయరని పేర్కొన్నారు.

అసలు సమస్య ఏంటంటే.. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలని  ఓ వర్గం వారు మాత్రమే కోరుకుంటున్నారు, మిగతా విద్యార్థులంతా డ్రస్ కోడ్‌ను పాటిస్తున్నారని జస్టిస్ హేమంత్ గుప్తా అన్నారు. మిగతా వర్గాల వారు మేం అది ధరిస్తాం, ఇది ధరిస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు.

న్యాయవాది దేవ్‌ దత్ మాట్లాడుతూ.. స్కూళ్లలో కొంతమంది విద్యార్థులు మతపరమైన రుద్రాక్షను కూడా ధరిస్తున్నారని కోర్టుకు చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. రుద్రాక్షను షర్టు లోపలే ధరిస్తారని, రుద్రాక్ష ఉందా? లేదా ? అని ఎవరూ చెక్ చేయరని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లలో హిజాబ్‌ను నిషేధించడాన్ని  హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుగుతోంది.
చదవండి: భారత్‌ జోడో యాత్ర.. లేఖ విడుదల చేసిన సోనియా

మరిన్ని వార్తలు