నేటి నుంచి పలు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న స్కూళ్లు

21 Sep, 2020 09:18 IST|Sakshi

9 నుంచి 12వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్‌ విద్యాసంస్థలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు కోవిడ్‌ నిబంధనల ప్రకారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో 21 నుంచి ఇక సర్కార్‌ బడుల టీచర్లు 50 శాతం మంది హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది చొప్పున రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కంటైన్‌మెంట్‌ జోన్లలో పాఠశాలలు మూసే ఉంటాయి. (చదవండి: కేసుల కంటే రికవరీలే ఎక్కువ)

దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 25 నుంచి దేశంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 54 లక్షలను అధిగమించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

మరిన్ని వార్తలు