ఎర్రకోట శత్రు దుర్భేద్యం

8 Aug, 2021 01:04 IST|Sakshi
ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద కంటైనర్లతో తాత్కాలిక గోడ   

ప్రధాన ద్వారం వద్ద కంటైనర్లతో తాత్కాలిక గోడ 

పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు 

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకోటను శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్‌ కంటైనర్లతో తాత్కాలిక రక్షణ గోడను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని దాటుకొని లోపలికి అడుగుపెట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. చాందినీ చౌక్‌ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఎర్రకోటలోకి ప్రవేశించలేని విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

చరిత్రాత్మక ఎర్రకోట వద్ద కంటైనర్లతో తాత్కాలికంగా భారీ గోడను సిద్ధం చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇవి ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు వేస్తున్నారు. గ్రాఫిటీ కళతో కనులకు ఇంపుగా తీర్చిదిద్దుతున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన డిమాండ్‌తో రైతులు నెలల తరబడి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలను వేదికగా మార్చుకొనే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినం సందర్భంగా ఎర్రకోట వద్ద రైతులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

నిరసనకారులు అక్కడే మతపరమైన జెండా ఎగురవేయడం సంచలనం సృష్టించింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, ఎయిర్‌ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ గత నెలలో అప్పటి ఢిల్లీ కమిషనర్‌ బాలాజీ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 16వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రకోట వెనుక భాగంలోని విజయ్‌ఘాట్‌ వద్ద అనుమానాస్పదంగా ఎగురుతున్న ఓ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు