సిక్కింలో భారీ ప్రాణనష్టం.. డ్యామ్‌ నిర్మాణంపై సీఎం సంచలన కామెంట్స్‌

6 Oct, 2023 15:40 IST|Sakshi

గ్యాంగ్‌టక్‌: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 40కి చేరుకోగా.. వారిలో 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్‌ డ్యామ్‌ కొట్టుకుపోయిందన్నారు. 

కాగా, సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్‌ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదు. ఫలితంగా ఇది కొట్టుకుపోయింది. రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. క్లౌడ్‌ బర్ట్సింగ్‌ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్‌ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా వరదల కారణంగా కొట్టుకుపోయినట్టు స్పష్టం చేశారు. ఇది సిక్కిం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. తీస్తాపై 13 వంతెనలు కొట్టుకుపోయాయని తమాంగ్ వివరించారు.


ఇదిలా ఉండగా.. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా చుంగుతాంగ్‌ డ్యామ్‌కు గండి పడిన సమయంలో లోనాక్‌ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యామ్‌లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు శాటిలైట్‌ ఫొటోలు వివరిస్తున్నారు. ఈ నీరు కూడా డ్యామ్‌లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 వరకు ఉన్నాయి. వీటిల్లో కుంభవృష్టిలు, భారీ మంచు పెళ్లలు విరిగిపడినా.. ఇవి గట్లు తెంచుకొని ఊళ్లపై పడతాయి. లోనాక్‌ సరస్సు ప్రదేశం సెస్మిక్‌ జోన్‌లో ఉండటంతో భూకంపాల కారణంగా ఇది లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


మరోవైపు.. ఆకస్మిక వరదలతో చుంగ్‌థంగ్‌ డ్యామ్‌ ధ్వంసం కావడం.. విద్యుత్‌ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్‌ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్‌ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్‌థంగ్‌ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు.

మరిన్ని వార్తలు