లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్‌ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం

25 Jan, 2023 18:09 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సహాయాక బృందాలు రక్షించిన ఇద్దరు మహిళలు బుధవారం చికిత్స పొందుతూ చనిపోయారు. మృతి చెందిన ఇద్దరూ మహిళలు సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్‌ హైదర్‌ తల్లి బేగం హైదర్(72), అతని భార్య ఉజ్మా(30) హైదర్‌గా గుర్తించారు.

ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిథిలాల కింద ఇంకా ఇద్దరూ లేదా ముగ్గురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన అలాయా అపార్ట్‌మెంట్‌ యజమానులు మహ్మద్‌ తారిఖ్‌, నవాజీష్‌ షాహిద్‌, బిల్డర్‌ ఫహద్‌ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐతే డివిజన్‌ కమిషనర్‌ రోషన్‌ జాకబ్‌ లక్నో డెవలప్‌మెంట్‌ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆ బిల్డర్‌ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే వాటిని కూడా కూల్చేయమని చెప్పారు జాకబ్‌. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డివిజన్‌ రోషన్‌ జాకబ్‌ నేతృత్వం వహించగా, లక్నో పోలీసలు జాయింట్‌ కమిషనర్‌ పీయూష్‌ మోర్డియా, పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. 

(చదవండి: లక్నో: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్‌.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!)

>
మరిన్ని వార్తలు