నవ్‌లఖా గృహ నిర్బంధానికి సుప్రీం అనుమతి

11 Nov, 2022 06:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్లుగా జైలులో గడుపుతున్న ఎల్గార్‌ పరిషత్‌–మావో సంబంధాల కేసులో నిందితుడు, సామాజిక కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రూ.2.4 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గృహ నిర్బంధంపై 14 షరతులు విధించింది. 70 ఏళ్ల నవ్‌లఖా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా గృహ నిర్భంధానికి అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ ఆదేశాలు తాత్కాలికమని నెల రోజుల తర్వాత సమీక్షిస్తామంటూ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ రెండో వారానికి వాయిదా వేసింది.

గృహనిర్భంధానికి అనుమతి ఇవ్వాలన్న నవ్‌లఖా పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌ల సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు 2020 నుంచి కస్టడీలో ఉన్నారు. గతంలో గృహనిర్బంధం దుర్వినియోగం చేసిన ఫిర్యాదులేవీ లేవు. ఈ కేసు మినహా మరో నేరపూరిత ఆరోపణలు లేవు. అందుకే హౌస్‌అరెస్ట్‌కు అనుమతినిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీల ఏర్పాటు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నిఘా తదితరాల ఖర్చు మొత్తం నవ్‌లఖా భరించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు..

► పోలీసుల సమక్షంలో వారిచ్చిన ఫోన్‌ నుంచి రోజుకు 10 నిమిషాలు మాట్లాడొచ్చు.
► సహచరుడి ఇంటర్నెట్‌లేని ఫోన్‌ వాడొచ్చు. ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌కు అనుమతి. వాటిని డిలీట్‌ చేయకూడదు. ముంబై వదిలి వెళ్లొద్దు.
► గరిష్టంగా ఇద్దరు కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి 3 గంటల పాటు సందర్శించొచ్చు.
► కేబుల్‌ టీవీ చూడొచ్చు. కేసులో సాక్షులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దు.

మరిన్ని వార్తలు