ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ

11 Nov, 2022 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని  అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు.

కోవిడ్‌–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్‌ బాక్స్‌ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి     తగ్గిందని వివరించారు.  

మరిన్ని వార్తలు