చట్టాలకు బ్రేకులేయండి

18 Dec, 2020 04:40 IST|Sakshi
ఢిల్లీ సరిహద్దులో సాగు చట్టాల వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది రైతులు

సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రానికి సుప్రీం సూచన

చర్చలకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్య

నిరసనలు చేసే హక్కు రైతులకుంది 

ఆందోళనలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కారాదు

న్యూఢిల్లీ/చండీగఢ్‌ : అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రైతుల నిరసన తెలిపే హక్కును హరించకూడదని సూచించింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది.

పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిరసన తెలిపే హక్కు అంటే అర్థం నగరంలోని రోడ్లన్నీ మూసివేయడం కాదని తేల్చిచెప్పింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా నిరసనలను నిరోధించే హక్కు పోలీసులకు, అధికారులకు ఉందని గుర్తు చేశారు.

జరుగుతున్న పరిణామాలు బాధాకరం  
రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ల కలవర పడుతున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు ముందుకు రారని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిలిపివేయాలని తాము కోరడం లేదని, రైతులు చర్చలకు ముందుకు వచ్చేందుకు వీలుగా తాత్కాలికంగా వాటి అమలును వాయిదా వేయాలని కోరుతున్నట్టు ధర్మాసనం తెలిపింది.

రైతు సంఘాలు, నిపుణులతో కమిటీ  
భారీ సంఖ్యలో రైతులను నగరంలోకి అనుమతిస్తే వారు హింసకు పాల్పడరని ఎవరు హామీ ఇవ్వగలరు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ హింస జరిగితే కోర్టు అడ్డుకోలేదని, అది కోర్టు పనికాదని గుర్తుచేసింది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ఇతర అధికారులపై ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో చర్చలు జరపకపోతే నిరసన ఉద్దేశం నెరవేరదని భారతీయ కిసాన్‌ యూనియన్‌(భాను)ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలతో పాటు పాలగుమ్మి సాయినాథ్‌ లాంటి నిపుణులను కమిటీలో నియమించనున్నట్లు వెల్లడించింది.    

ఆగిన మరో అన్నదాత గుండె  
సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న మరో రైతు గుండె ఆగిపోయింది. టిక్రీ బోర్డర్‌లో పంజాబ్‌కు చెందిన 38ఏళ్ల రైతు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మరణించిన రైతును భటిండా జిల్లాకు చెంది న జై సింగ్‌గా గుర్తించారు. జై సింగ్‌ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగం ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు.    

నరేంద్రసింగ్‌ తోమర్‌ బహిరంగ లేఖ
రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేం ద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. ఆయన తాజాగా రైతులకు బహిరంగ లేఖ రాశారు. చిన్న, సన్నకారు రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు. అభ్యంతరాలుంటే చర్చలకు ముందుకు రావాలని కోరారు. తోమర్‌ లేఖను అందరూ చదవాలని ప్రధాని మోదీ కోరారు.

చట్టాల ప్రతులు చింపిన కేజ్రీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తాను రైతాంగానికి ద్రోహం చేయలేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. కొత్త చట్టాల ప్రతులను అసెంబ్లీలో చించివేశారు. ఈ చట్టాలు బీజేపీ ఎన్నికల నిధుల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం కాదని ఆరోపించారు. ‘‘గడ్డకట్టే చలిలో, కేవలం రెండు డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల మధ్య రోడ్లపైనే నా దేశ రైతాంగం నిద్రిస్తుంటే, వారికి నేను ద్రోహం చేయలేను. తొలుత నేను ఈ దేశ పౌరుడిని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  నిరసన ఉద్యమంలో ఇప్పటికే 20 మంది రైతులు మరణించారని, ఇంకెప్పుడు మేల్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు.  

మంత్రులతో అమిత్‌ భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా గురువారం పలువురు సహచర మంత్రులతో భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్, పీయుష్‌ గోయల్, నరేంద్ర సింగ్‌ తోమర్‌లతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.బీజేపీ శ్రేణులు ఎంతవరకు రైతాంగాన్ని చేరగలిగారనే అంశంపై సమీక్షించినట్టు తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు