ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు

7 Oct, 2020 12:46 IST|Sakshi

న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చేపట్టే ఆందోళనలు, ధర్నాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా రాస్తారోకోలు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అదే విధంగా ఆందోళనకారులను బహిరంగ ప్రదేశాల నుంచి ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, సాధారణ పౌరుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు చేపట్టేందుకు తమ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిర్ధారించిన, తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ధర్నాలు చేసుకోవాలని నిరసనకారులకు స్పష్టం చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతేడాది ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.(చదవండి: అరెస్ట్‌ చేయకపోవడం సీరియస్‌ విషయం!) 

ఈ నేపథ్యంలో షాహిన్‌బాగ్‌- కాళింది కుంజ్‌ మార్గంలో రాస్తారోకో వల్ల జనజీవనానికి ఆటంకం కలిగిందని పేర్కొంటూ న్యాయవాది అమిత్‌ సాహ్ని ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, అయితే వారి కారణంగా ఇతరులకు ఇబ్బంది కలగుకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ నిరసన వ్యక్తం చేసేందుకు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టవచ్చు. ఇందుకు సంబంధించిన విధానాలపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీటిని అమలు చేసేందుకు కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’’అని పేర్కొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు