ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత విమర్శలు

20 Oct, 2020 20:45 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఇమేజ్‌ను పెంచుకునే మరో ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశారంటూ కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనాతే విమర్శించారు. భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం యువత సంఖ్య అధికంగా ఉండటమే కారణమని, కానీ ఆ క్రెడిట్‌ను ప్రధాని తన ఖాతాలో వేసుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ప్రధాని మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో, పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి​ చేస్తోందన్నారు. అదే విధంగా కరోనా ప్రభావిత దేశాలైన అమెరికా, బ్రెజిల్‌  మరణాల రేటు అధికంగా ఉందని, భారత్‌లో మాత్రం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే సామాజిక దూరం, మాస్కు ధరించడం వంటి కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరించారు. (చదవండి: పండగ సీజన్‌లో అప్రమత్తత అనివార్యం : మోదీ)

ఇక ప్రధాని ప్రసంగంపై స్పందించిన సుప్రియ.. ‘‘మరో ఈవెంట్‌ ముగిసింది. ఇమేజ్‌ పెంచుకునే ప్రయత్నం. బిహార్‌ ఎన్నికలకు ముందుగానే ఇదంతా. సరైన చర్యలు లేవు. వైఫల్యాలను అంగీకరించనూ లేదు. యువత ఎక్కువగా ఉన్న దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందన్న క్రెడిట్‌ తీసుకున్నారు. మీడియా ప్రశ్నలు అడగకుండా మిషన్‌ పూర్తి చేసింది’’అంటూ ట్వీటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా ఈనెల 28న బిహార్‌లో తొలి విడత పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార హోరు పెంచిన పార్టీలు పరస్పర విమర్శలతో దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ , ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మాటల యుద్ధానికి దిగుతోంది. ఇక కోవిడ్‌ కట్టడిలో పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌‌ వంటి దేశాలు భారత్‌ కంటే ఉత్తమంగా పని చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.(చదవండి: కోవిడ్‌ కట్టడిలో పాక్‌ బెటర్‌: రాహుల్‌)

మరిన్ని వార్తలు