కలుపుగోలు సీఎం: స్టాలిన్‌ కొత్త సంప్రదాయం

14 May, 2021 08:13 IST|Sakshi

లాక్‌డౌన్‌ మరింత కఠినం

అసెంబ్లీ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం

కరోనా కట్టడికి ఐదు తీర్మానాలు

చర్చల్లో పాల్గొన్న 13 పార్టీల నాయకులు

కరోనా నియంత్రణకు పలు ఆంక్షలు విధించినా, లాక్‌డౌన్‌ అమలు చేసినా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో లాక్‌డౌన్‌ను తీవ్రతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐదు తీర్మానాలు చేసింది. వాటిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. పూర్తి లాక్‌డౌన్‌ విధించినా వైరస్‌ ప్రతాపం చూపుతూనే ఉంది. రోజుకు సగటున 30 వేల మంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 14,63,364 మంది కరోనా వైరస్‌కు గురికాగా, ప్రస్తుతం 1.85 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు చాలక ప్రాంగణాలు, అంబులెన్స్‌లలో ఉండి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కల్యాణ మండపాలు, కాలేజీలు, పాఠశాలలను ఆక్సిజన్‌ వసతితో కూడిన పడకల ఆస్పత్రులుగా మారుస్తోంది. వ్యాక్సినేషన్‌ కూడా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేత గా ఉన్న స్టాలిన్‌ కరోనా కట్టడికి అనేక సూచనలు చేశారు. అసెంబ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వాటిల్లో ఒకటి.

ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్‌ గురువారం అసెంబ్లీ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలపై నేతల అభిప్రాయాలు సేకరించారు. డీఎంకే తరఫున టీఆర్‌ బాలు, ఆర్‌ఎస్‌ భారతి, అన్నాడీఎంకే నుంచి జయకుమార్, పరమశివం, కాంగ్రెస్‌ నుంచి విజయధరణి, మునిరత్నం, బీజేపీ నుంచి నయనార్‌ నాగేంద్రన్, పీఎంకే, ఎండీఎంకే వీసీకే, సీపీఎం, ఎంఎంకే, కేఎండీకే, టీవీకే తదితర 13 పారీ్టల నేతలు హాజరయ్యా రు. చెన్నైలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలవుతోందా, 24వ తేదీ తర్వాత ఎత్తివేయడమా, కొనసాగించడమా అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ రెమ్‌డెసివర్‌ మందు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చెన్నైతోపాటు ఇతర నగరాల్లో అమ్మకాలు సాగిస్తున్నామని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో పారదర్శకతను పాటిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సహాయక చర్యల నిమిత్తం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమును ప్రారంభించామని, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఆక్సిజన్‌ దిగుమతి కోసం కేంద్రంపై చేసిన ఒత్తిడి సత్పఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. సింగపూరు, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి ఆక్సిజన్‌ కంటైనర్లను రప్పిస్తున్నట్టు వివరించారు. పాజిటివ్‌ కేసుల పెరుగుదల వల్ల ఆక్సిజన్‌ పడకలు పెంచుతున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే ప్రకటించామని స్టాలిన్‌ వివరించారు.

అఖలపక్షంలో ఐదు తీర్మానాలు : 
అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైద్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌ మీడియాకు వివరించారు. కరోనా నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే అవసరమైన అన్ని చర్యల్లో పాలుపంచుకోవాలని, అన్నిపార్టీల సభలు, సమావేశాలు, ఇతర పార్టీ కార్యకలాపాలను నిలిపివేయాలని తీర్మానించారు. అలాగే సంపూర్ణ లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని, కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు అన్ని పార్టీలు సహకారం అందించాలని పేర్కొన్నారు. కరోనా కట్టడికి అఖిలపక్ష పార్టీ సభ్యులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా రోగులను చివరి క్షణంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించడం అమానవీయ చర్య అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి పెరగగానే రెమ్‌డెసివర్‌ మందును సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.

సింగపూర్‌ నుంచి 256 ఆక్సిజన్‌ సిలిండర్లు  
కరోనా బారిన పడిన వారిలో అధిక శాతం ఊపిరాడక ఇబ్బందిపడుతున్నారు. వారికి ఆక్సిజన్‌ అమర్చక తప్పడం లేదు. దీంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఉత్పిత్తి చేసిన ఆక్సిజన్‌ను నిల్వ చేసేందుకు సరిపడా సిలిండర్లు, కంటైనర్లు లేవు. దీంతో ఇటీవల జర్మనీ, బ్రిటన్‌ దేశాల నుంచి 900 ఖాళీ సిలిండర్లు, కంటైనర్లను రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కంపెనీ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. తొలి లారీ కంటైనర్‌ను తిరునెల్వేలి ఆస్పత్రికి గురువారం పంపారు. మూడు రోజుల్లో 35 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది చాలక ఖాళీ సిలిండర్లు, కంటైనర్లను పంపాల్సిందిగా సింగపూరు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 256 ఖాళీ సిలిండర్లు బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకున్నాయి.

చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్‌: చేజారనున్న ‘పెద్దరికం’

చదవండి: సీఎం స్టాలిన్‌ నిర్ణయం: టీచర్‌ నుంచి తమిళనాడు స్పీకర్‌గా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు