Tamil Nadu: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులపై తమిళనాడులో దాడులు నిజమేనా..?

4 Mar, 2023 12:23 IST|Sakshi

చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో ఆ రాష్ట్ర కార్మిక సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి సీవీ గణేషన్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. కావాలనే తమిళనాడుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

తమిళనాడుకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కార్మికలు వచ్చి పనిచేస్తున్నారని, వారంతా శాంతియుత వాతావరణంలో పని చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కొందరు దురుద్దేశంతోనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

'పెద్ద, చిన్న పరిశ్రమలు తమిళనాడులో చాలా ఏళ్లుగా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా తమ పని చేసుకుంటారు. రాష్ట్రాభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తమిళనాడులో కొన్ని చోట్ల ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారిపై దాడులు జరుగుతున్నాయనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారికి కూడా ఈ విషయం తెలుసు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని మంత్రి హెచ్చరించారు.

బిహార్ ప్రభుత్వం ప్రత్యేక బృందం..
కాగా.. తమిళనాడులో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులపై నిజంగానే దాడులు జరగుతున్నాయా? అనే విషయంపై బిహార్ ప్రభుత్వం నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు తమిళనాడును సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా

మరిన్ని వార్తలు