ప్రేమ, కులాంతర వివాహం.. 13 జంటలపై బహిష్కరణ వేటు

17 Jan, 2022 13:05 IST|Sakshi

ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు సామాజిక బహిష్కరణ 

బాధితుల ఫిర్యాదుతో కులపెద్దలపై కేసు నమోదు

పుణె: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకుగాను వారిని కొన్నేళ్ల పాటు సామాజికంగా బహిష్కరించారు కులపెద్దలు. ఆ బహిష్కరణకు గురైంది ఒకరిద్దరు కాదు ఏకంగా 13 జంటలు. బాధితుల్లో ఒకరు ఈ వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కులపెద్దల పంచాయతీ భాగోతం వెలుగు చూసింది. దీంతో కులపెద్దలు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన నాందివాలే కమ్యూనిటీకి చెందిన జాట్లు కొంతమంది ప్రేమించి కులాంతర వివాహాలను చేసుకున్నారు.

అయితే వీరికి కుల పంచాయతీ పెట్టిన కుల పెద్దలు వీరిని ఊరునుంచి బహిష్కరించారు. ఇది జరిగి కొన్నేళ్లు గడిచాక వీరిని తమకులంలో చేర్చుకునే విషయమై ఈనెల 9న పలాస్‌లో సమావేశం నిర్వహించారు. కులం నుంచి బహిష్కరించిన వారిని తిరిగి తమ కులంలో కలుపుకునేందుకు అనుమతించాలని సమావేశంలో కొందరు ప్రతిపాదించారు. దీనికి చాలామంది కులపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సమావేశంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై సామాజిక బహిష్కరణ మరింత కాలం అమలు చేయాలని తీర్మానించారు.

చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..)

అంతకుముందు ఇటువంటి తరహా సమావేశాన్ని గతేడాది డిసెంబరులో సతారా జిల్లా కరద్‌లో నిర్వహించగా..2007లో కుల బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ప్రకాష్‌ భోసాలే (42) ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా సామాజిక బహిష్కరణ ఎత్తివేయాలన్న ప్రతిపాదనను కొంతమంది తీసుకురాగా కుల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమావేశం నుంచి ప్రకాశ్‌ భోసాలే వెనుదిరిగి వచ్చేశారు. అనంతరం స్థానికంగా పనిచేస్తోన్న ఓ స్వచ్చంద సేవా సంస్థ అంధశ్రద్ధ నిర్మూలన్‌ సమితిని కలసి తమ సమస్యను వివరించారు. ఆ సమితి వారి సహాయంతో ప్రకాశ్‌ భోసాలే నేరుగా పలాస్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనలా సామాజిక బహిష్కరణకు గురైన వారు 13 జంటలు ఉన్నాయని పేర్కొనడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకాశ్‌ భోసాలే ఫిర్యాదు మేరకు ఆరుగురు జాట్లపై కేసు నమోదు చేసినట్లు పలాస్‌ ఎస్సై వికాస్‌ జాధవ్‌ తెలిపారు. 

చదవండి: (చైనా మాంజా గొంతు కోసేసింది: కళ్లెదుటే భర్త ప్రాణాలు పోతుంటే..)

మరిన్ని వార్తలు