దిశ రవి బెయిలు పిటిషన్‌: జడ్జి కీలక వ్యాఖ్యలు

20 Feb, 2021 17:22 IST|Sakshi

తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం

న్యూఢిల్లీ: ‘‘అసలు టూల్‌కిట్‌ అంటే ఏమిటి? దిశ రవిపై ఏయే ఆరోపణలు ఉన్నాయి? ప్రాసిక్యూషన్‌ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? జనవరి 26 నాటి హింసతో ఆమెకు ఉన్న ప్రత్యక్ష సంబంధాలు నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా?’’ అని ఢిల్లీ హైకోర్టు పోలీసులకు ప్రశ్నలు సంధించింది. కేవలం ఊహాజనిత అంశాల కారణంగా ఓ వ్యక్తికి బెయిలు నిరాకరించాలని కోరుతున్నారా అని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘టూల్‌ కిట్‌’ కేసులో అరెస్టైన పర్యావరణ వేత్త దిశ రవి బెయిలు పిటిషన్‌ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తన వాదనలు వినిపించారు.

ఈ మేరకు.. ‘‘ ఖలిస్థాన్‌ ఉద్యమానికి మద్దతు పలుకుతున్న పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌(పీజేఎఫ్‌) సంస్థతో దిశ రవికి సంబంధాలు ఉన్నాయి. ఎంఓ ధలివాల్‌ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఆమె కలిశారు. కాబట్టి తన ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా అర్ధమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన జస్టిస్‌ ధర్మేంద్ర రానా.. ‘‘మరి నాకైతే ఎంఓ ధలివాల్‌ ఎవరో తెలియదు’’అని వ్యాఖ్యానించారు. కాగా పీజేఎఫ్‌ అనే ఎన్జీవో సహ వ్యవస్థాపకులే ఈ ధలివాల్‌. మానవ హక్కులు, సామాజిక న్యాయం గురించి ఈ సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 11 నెలల క్రితం దీనిని స్థాపించారు. అయితే ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులకు ఇది మద్దతుగా ఉంటోందని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం గురించి న్యాయమూర్తికి తెలిపిన సాలిసిటర్‌ జనరల్‌.. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని వాడుకుని, హింసకు ప్రేరేపించేలా కుట్రలు చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఓ వెబ్‌సైట్‌ లింక్‌ను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. అయితే, ఇది డైరెక్ట్‌ లింకేనా లేదా కేవలం ఊహాజనిత అంశాలతో దిశరవికి ఈ అంశంతో ముడిపెడుతున్నారా అని జస్టిస్‌ రానా ప్రశ్నించారు. ఆమెకు వ్యతిరేకంగా ఇంకా బలమైన సాక్షాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ఈ కుట్రలో ఒక్కొక్కరు ఒక్కో పాత్ర పోషించారని, లోతుగా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్ని ఆధారాలు సేకరిస్తామని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బదులిచ్చారు.

అదే విధంగా దిశ రవి బయటకు వస్తే సాక్ష్యాధారాలను మాయం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆమెకు బెయిలు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘విచారణకు ఆమె సహకరించడం లేదు. తనకు సంబంధించిన డివైస్‌లను ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కొంత సమాచారం డెలిట్‌ అయినట్లు గుర్తించాం. విచారణ కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు. అవన్నీ కాదు సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి అంటూ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్‌కు స్పష్టం చేశారు. తీర్పును మంగళవారం వరకు రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా స్వీడిష్‌ గ్రెటా థంబర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌ కిట్‌ను దిశ రవితో పాటు మరో నికితా జాకబ్‌, శంతను ములుక్‌ ఎడిట్‌ చేశారని, తద్వారా గణతంత్ర దినోత్సవం నాటి ట్రాక్టర్‌ ర్యాలీలో హింస చెలరేగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన దిశ రవిని ఫిబ్రవరి 13న అరెస్టు చేశారు.
చదవండి:
‘టూల్‌కిట్’‌‌ అంటే ఏంటో తెలుసా?

దిశ రవి అరెస్టు: ఏమిటీ ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌?

మరిన్ని వార్తలు