ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్‌ హోల్‌ మైనర్ల ఆవేదన

23 Dec, 2023 15:56 IST|Sakshi

ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌.. ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదానికి  ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్‌లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్‌ హోల్‌ మైనర్లది కీలక పాత్ర.  ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీమి గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు.

అయితే ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్‌గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.

యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి  షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్‌గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం ఆపరేషన్‌లో సహకరించిన మైనర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. 

కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్‌ 12వ తేదీన  41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ రంగంలోకి దిగి వారిని రక్షించారు. 

>
మరిన్ని వార్తలు