వీడియో: పులి కోసం అంతా పడిగాపులు! అంతలో ఊహించని రీతిలో సర్‌ప్రైజ్‌

28 Nov, 2022 18:25 IST|Sakshi

వైరల్‌: అడవుల్ని, అందులోని వన్యప్రాణులను కదిలించడం మనిషికి బాగా అలవాటైపోయింది. వాటి ఆవాసాల్లో వెళ్లి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఫలితం.. సో కాల్డ్‌ జనావాసాల మీద వన్యప్రాణుల దాడులు లేదంటే తిరిగి వాటినే చంపడం చూస్తున్నాం. అయితే.. 

వన్య ప్రాణులు ఎదురైనప్పుడు  ఎలా వ్యవహరించాలనే స్పృహ లేకుండా పోతున్నారు చాలామంది. తాజాగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సురేందర్‌ మెహ్రా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

ఓపెన్‌ సఫారీ వ్యూ కోసం వెళ్లిన కొందరికి పెద్దపులి తానేంటో చూపెట్టింది. ఆశగా దాని చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లపై.. ఒక్కసారిగా దూసుకొచ్చి వణుకు పుట్టించింది. టూరిస్టులు ఓ ఓపెన్‌ జీప్‌లో ఉండగా.. పొదల మాటున పులి ఉండడం గమనించి జీప్‌ డ్రైవర్‌ ఆపేశాడు. ఆ సమయంలో అది ఎప్పుడు బయటకు వస్తుందా? క్లిక్‌ మనిపిద్దామా? అని కెమెరాలతో రెడీగా ఉన్నారు కొందరు. అయితే.. వాళ్ల గోలకు చిర్రెత్తుకొచ్చిందేమో. గాండ్రిస్తూ ఉగ్రంగా ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. 

ఆ దెబ్బకు భయంతో జీప్‌ డ్రైవర్‌ వాహనాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లాడు. గట్టిగా అరవడంతో అది కాస్త వెనక్కి తగ్గింది. కొన్నిసార్లు, పులిని చూడటం కోసం మనం కనబరిచే అతి ఆత్రుత.. వాటి(పులుల)  జీవితంలోకి చొరబడడం తప్ప మరొకటి కాదు అంటూ సురేందర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ, ఆయన ట్వీట్‌ ద్వారా వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు