పద్మ అవార్డుల ప్రదానంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్‌

21 Mar, 2022 21:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. అందులో నలుగురికి పద్మ విభూషణ్‌,17 మంది పద్మభూషణ్‌, 107 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

అయితే, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. పద్మా పురస్కారాలను రామ్​నాథ్​ కోవింద్​ గ్రహీతలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పద‍్మ శ్రీ అవార్డు అందుకునే ముందు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సందర్భంగానే శివానంద.. రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో పైకి లేపారు.

మరోవైపు.. భారత తొలి సీడీఎస్ జనరల్​ బిపిన్​ రావత్​కు మరణానంతరం పద్మ విభూషణ్​ ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట‍్రపతి చేతుల మీదుగా ఆయన కుమార్తెలు క్రితిక, తరణి స్వీకరించారు. కాగా, ​రాధే శ్యామ్​ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, పారాలింపిక్​ రజత పతక విజేత దేవేంద్ర జఝారియా పద్మ భూషణ్‌ అవార్డును అందుకున్నారు.

తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌కు చెందిన కిన్నెర మొగిలయ్య, తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్త గరికపాటి నరిసింహారావులు పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అయితే, విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండో విడతలో అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది.

మరిన్ని వార్తలు