భారతీయ ప్రయాణికులకు కెనడా శుభవార్త! ఆ నిబంధనలు ఎత్తివేత?

29 Jan, 2022 14:03 IST|Sakshi

ఇండియా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఇండియా నుంచి నేరుగా లేదా గల్ఫ్‌/యూరప్‌/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చింది. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని చుట్టేస్తుండటంతో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల విషయంలో కెనడా కఠిన ఆంక్షలు విధించింది. కెనడా బయట్దేరడానికి 18 గంటల ముందు కోవిడ్‌ నెగటీవ్‌ సర్టిఫికేట్‌ (ఆర్టీ పీసీఆర్‌) సమర్పిస్తేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. ఇక సింగిల్‌ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులైతే మార్గమధ్యంలోని ఎయిర్‌పోర్టులో కూడా నెగటివ్‌ సర్టిఫికేట్‌ తీసుకోవాలంటూ నిబంధన విధించింది. దీని కారణంగా అనేక మంది భారతీయులు గల్ఫ్‌ దేశాల్లో క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

కెనడా ప్రభుత్వం తాజాగా సడలించిన నిబంధనల ప్రకారం ఇండియా నుంచి నేరుగా  లేదా సింగిల్‌ స్టాప్‌లో వచ్చే  ప్రయాణికులకు 18 గంటల కోవిడ్‌ సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు టెస్ట్‌ చేయించిన కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ ఒక్కటి ఉంటే చాలని పేర్కొంది. ఇండియాతో పాటు మొరాకో దేశానికి ఈ మినహాయింపును వర్తింప చేస్తోంది. 2022 జనవరి 28 నుంచి ఈ మినహాయింపు అమల్లోకి రానుంది. 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేసిన సందర్భంలో భారతీయ ప్రయాణికులపై కెనడా నిషేధం విధించింది. ఐదు నెలల అనంతరం 2021 సెప్టెంబరు 27న విమాన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. కానీ కొద్ది కాలానికే ఒమిక్రాన్‌ వెలుగు చూటడంతో మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

చదవండి: ప్రయాణం మధ్యలో పాజిటివ్‌. అబుదాబిలో చిక్కుకుపోయిన భారతీయులు

మరిన్ని వార్తలు