సిలికానాంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణ పనులు ప్రారంభం

17 Sep, 2021 19:34 IST|Sakshi

సిలికాన్‌ వ్యాలీ : ప్రవాస భారతీయులు నెలకొల్పిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌ నిర్మాణ పనులు మొదలయ్యాయి. శాన్ వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణ సమీపంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ క్యాంపస్‌ నిర్మాణం జరగనుంది. 2016లో స్థాపించిన  ఈ యూనివర్సిటీకి WASC SCUC (Senior College and University Commission) గుర్తింపు ఉంది. 

67 ఎకరాల్లో
ఈ ప్రాంగణ నిర్మాణానికి 67 ఎకరాల భూమిని సంధు కుటుంబం విరాళంగా అందించింది. సిలికాన్ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌ వల్ల శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధనను అందిస్తుందన్నారు. 

రూ. 3,300 కోట్ల వ్యయంతో
రాబోయే ఐదేళ్లలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్యాంపస్‌ నిర్మాణానికి  450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు)ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్ సైటులో లభ్యమవుతాయి. 

చదవండి : అమెరికాలో భారతీయుల హవా.. సంపాదనలో సూపర్‌

మరిన్ని వార్తలు