టిండర్‌లో పోకిరీ: యూకేలో భారత సంతతి వైద్యుడికి గట్టి ఝలక్‌

16 Jun, 2022 12:17 IST|Sakshi

లండన్‌: ఆన్‌లైన్ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన మహిళపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడిన భారత సంతతికి చెందిన వైద్యుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో డాక్టర్ మనేశ్ గిల్‌ను  దోషిగా నిర్ధారించిన స్కాటిష్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష  ఖరారు  చేసింది. 

టిండర్ యాప్‌లో మైక్ అనే పేరుతో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు గిల్‌. ఈ క్రమంలో డిసెంబరు 2018లో స్టిర్లింగ్‌లోని ఒక హోటల్‌లో మీట్‌ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. కానీ పథకం ప్రకారం ముందుగానే రూం బుక్‌ చేసుకున్న అతగాడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఎడిన్‌బర్గ్‌లోని హైకోర్టు నేరస్తుడిగా నిర్ధారించింది.  దీంతో అతనికి  జైలు శిక్ష విధిస్తూ కోర్టు తాజా తీర్పు చెప్పింది. అలాగే గిల్‌ ప్రవర్తనను పర్యవేక్షణ నిమిత్తం లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో కూడా చేర్చింది

‘‘భయంకరమైన ప్రవర్తనకు గిల్‌ పరిణామాన్ని ఎదుర్కొంటున్నాడు. గిల్‌కు శిక్ష విధించడం లైంగిక నేరాలకు పాల్పడేవారికి చెంపపెట్టు లాంటి మెసేజ్‌ అస్తుందని స్కాట్లాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ యూనిట్ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫోర్బ్స్ విల్సన్‌. అలాగే బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి తనకు ఎదురైన భయంకర అనుభవాలను సాహసంగా వెల్లడించిందన్నారు. విచారణలో ఆమె పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ తీర్పు ఆమెకు కొంత ఉపశమనం కలిగిస్తుందని  ఆశిస్తున్నానన్నారు.

మరోవైపు ఈ కేసు విచారణలో బాధిత మహిళ తాను నర్సింగ్ విద్యార్థినని వెల్లడించింది. ఈ వేధింపుల పర్వంతో తాను అనుభవించిన మానసిక వేదనను విచారణ అధికారుల ముందు వివరించింది. కాగా పరస్పర అంగీకారంతోనే జరిగిందని, తాను లైంగిక దాడి చేయలేదని గిల్  వాదించాడు. అయినా కోర్టు బాధితురాలి వాదనను సమర్థించింది.  మనేశ్ గిల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు