ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు

25 Feb, 2023 08:58 IST|Sakshi
సమావేశంలో ఆర్‌ఐవో సునీత, పక్కన శేఖర్‌బాబు

26 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహణ

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 192 కేంద్రాలు

హాజరుకానున్న 35,881 మంది విద్యార్థులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా సైన్స్‌ కోర్సుల విద్యార్థులకు ఆదివారం నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్న ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్‌)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్‌ విద్య ఆర్‌ఐవో గన్నెపూడి సునీత తెలిపారు. సాంబశివపేటలోని ఆర్‌ఐవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్న 35,881 మంది విద్యార్థులకు 192 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో జరిగే ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్న విద్యార్థుల్లో ఎంపీసీ 28,772 మంది, బైపీసీ 7,117 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12, తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ప్రాక్టికల్స్‌కు హాల్‌ టికెట్‌ కలిగిన విద్యార్థులను అర్ధగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. మూడు స్పెల్స్‌లో జరగనున్న ప్రాక్టికల్స్‌లో 400 మందికి మించిన విద్యార్థులు ఉన్న కళాశాలల్లో అదనంగా మరో ప్రాక్టికల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏ, బీ సెంటర్లుగా విభజించినట్లు చెప్పారు.

అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా

ప్రాక్టికల్స్‌ సెంటర్లలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ఇంటర్‌బోర్డు నుంచి ఉన్నతాధికారులు లైవ్‌ స్ట్రీమింగ్‌ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తారని చెప్పారు. కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఒక్కరే సెల్‌ఫోన్‌ కలిగిఉండాలని, మిగిలిన సిబ్బంది ఎవ్వరి దగ్గర ఫోన్లు ఉండేందుకు అనుమతి లేదన్నారు. ప్రాక్టికల్స్‌ పూర్తవ్వగానే అక్కడికక్కడే పేపర్ల వాల్యూయేషన్‌ పూర్తి చేసి, సీల్డ్‌ కవర్‌లో సీఎస్‌కు అందజేయాలని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థికీ హాల్‌ టికెట్‌ ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకున్నా, కళాశాలల్లోని ప్రయోగ కేంద్రాల్లో ఏమైనా సమస్యలున్నట్లయితే గుంటూరు ఆర్‌ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ (0863–2228528)కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈసీ సభ్యుడు టి.శేఖర్‌బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు