పనిలో పనిఘా.. ఛేదన వడిగా!

3 Oct, 2023 10:14 IST|Sakshi

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాను నిఘా నీడలోకి తెచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం జాతీయ రహదారులు మొదలు గ్రామీణ రోడ్ల వరకు, పట్టణాలు నుంచి పంచాయతీల దాకా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్లు, జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూంలకు అనుసంధానం చేశారు. దీంతో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ద్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాల సేకరణ, నిందితులను పట్టుకోవడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తక్కువగా నమోదు అవుతున్నాయని, ఒక వేళ జరిగినా నిందితులను వెంటనే పట్టుకోవడానికి వీలవుతోందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో 22 కీలకమైన కేసులను పోలీసుల ఛేదించారు అంటే వీటి పనితీరును ఆర్ధం చేసుకోవచ్చు.

జిల్లా ఏర్పాటు తర్వాత 1,530 కెమెరాలు...
పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వై.రవిశంకర్‌రెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. సున్నితమైన ప్రాంతమైన పల్నాడులో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి ముమ్మరంగా ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాలు, కమాండ్‌ సెంటర్ల ఏర్పాటు అయ్యేలా చూశారు. 17 నెలల కాలంలోనే జిల్లాలోని 522 కీలక ప్రాంతాల్లో కొత్తగా 1,530 కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. వీటికి అదనంగా ప్రైవేట్‌ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నివాస సముదాయాల్లో ఆయా యాజమాన్యాలు, స్వచ్చంధ సంస్థలతో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేలా అవగాహనకల్పించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు, వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతోంది.

సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతగా స్వీకరించాలి
నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 17 నెలల కాలంలో కొత్తగా 1,530 కెమెరాలను ఏర్పాటుచేశాం. నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్లలో పలు కీలకకేసులను సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. ప్రతి గ్రామంలో కనీసం కీలకవై ున ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు పోలీసుశాఖ కృషి చేస్తోంది. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పట్టాయి. దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం.
– వై రవిశంకర్‌రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ

జిల్లా ఏర్పడినప్పటి నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య...

నరసరావుపేట 195 516

సత్తెనపల్లి 211 798

గురజాల 116 216

జిల్లా మొత్తం 522 1,530

మరిన్ని వార్తలు