సామర్థ్యాల మదింపు.. ప్రతిభ గుర్తింపు | Sakshi
Sakshi News home page

సామర్థ్యాల మదింపు.. ప్రతిభ గుర్తింపు

Published Tue, Oct 3 2023 1:50 AM

- - Sakshi

3, 6, 9 తరగతుల విద్యార్థులకు

సామర్థ్య పరీక్ష

నవంబర్‌ 3న పాఠశాలల్లో ‘సీస్‌’ సర్వే

ముందుగా ప్రాక్టీస్‌ పరీక్షలకు ఏర్పాట్లు

రాయవరం: చదువే అన్నింటికీ మూలం.. అందులో రాణిస్తే భవిష్యత్తు ఉజ్వలం. అందుకే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది, సమున్నత లక్ష్యంతో ముందుకు సాగేలా విద్యా వ్యవస్థలో నిరంతరం కసరత్తు జరుగుతోంది. విద్యార్థి తరగతి వారీగా అభ్యసన సామర్థ్యాలు సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాయి. చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి నాస్‌ సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2021లో చేశారు. తిరిగి 2024లో నిర్వహించనున్నారు. నాస్‌ సర్వేకు ముందుగా స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే మండల స్థాయిలో సర్వే చేపట్టనున్నారు. ఈ సీస్‌ సర్వే నవంబర్‌ 3న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. దీని ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవచ్చు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సర్వే జరుగుతోంది. తదనుగుణంగా విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.

ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల ఎంపికకు కసరత్తు

సీస్‌ సర్వేలో భాగంగా క్షేత్ర స్థాయిలో పరీక్ష నిర్వహించేందుకు ఆయా మండలాలకు ఎంత మంది ఎఫ్‌ఐలు అవసరమనేది విద్యాశాఖ నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు ఎఫ్‌ఐలుగా ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులను నియమించి, వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్వే నిమిత్తం నిర్వహించే పరీక్ష వీరి పర్యవేక్షణలో జరుగుతుంది. జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో డీసీఈబీ సెక్రటరీ, సమగ్ర శిక్షా ఏఎంవో, డైట్‌ ప్రిన్సిపాల్‌/లెక్చరర్‌, డీఈఓ కార్యాలయ ప్రతినిధి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియను పరిశీలిస్తారు. మండల స్థాయిలో పరీక్షల నిర్వాహకులుగా మండల విద్యాశాఖాధికారులు 1, 2తో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు వ్యవహరిస్తారు. ఈ పరీక్షకు ముందుగా విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ప్రాక్టీస్‌ పరీక్షల ద్వారా ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. గతంలో నిర్వహించిన సర్వేలో భాగంగా మూడు, ఐదు, ఎనిమిది తరగతులకు పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది సీస్‌ సర్వేలో మూడు, ఆరు, తొమ్మిది తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఈ పరీక్షలు జరుపుతారు. వీటి నిర్వహణకు ముందుగా విద్యార్థులకు ప్రాక్టీస్‌ పేపర్లను కూడా ఎస్‌సీఈఆర్‌టీ సరఫరా చేసింది. విద్యార్థులకు ప్రాక్టీస్‌ పేపర్ల ద్వారా తర్ఫీదునివ్వడం ద్వారా సీస్‌ పరీక్షను సమర్ధవంతంగా ఎదుర్కొనే అవకాశముంటుంది. పూర్తిగా ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. మూడు, ఆరు తరగతుల విద్యార్థులకు తెలుగు/ ఇంగ్లిష్‌, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతికి తెలుగు/ఇంగ్లిష్‌, గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులపై పరీక్ష నిర్వహిస్తారు.

సర్వేలో ముఖ్యాంశాలివీ..

ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో సర్వే నిర్వహిస్తారు. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. 3వ తరగతి విద్యార్థులకు మూడో తరగతి సిలబస్‌పై, 6వ తరగతికి ఐదో తరగతి సిలబస్‌, 9వ తరగతి విద్యార్థులు 8వ తరగతి సిలబస్‌పై పరీక్ష నిర్వహిస్తారు. 3, 6 తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్‌, గణితం, ఈవీఎస్‌, 9వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్‌, గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల్లో పరీక్ష చేపడతారు. 3, 6 తరగతుల విద్యార్థులకు 40 ప్రశ్నలు 60 నిమిషాల్లో రాయాలి. 9వ తరగతి విద్యార్థలు 60 ప్రశ్నలకు 90 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కోఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో శిక్షణనిస్తారు. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు విద్యార్థులు, స్కూల్‌, టీచర్‌ ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలు రాయించాల్సి ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్‌ షీట్‌లో రాయాలి. ప్రతి శనివారం ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహిస్తే విద్యార్థులు సులువుగా పరీక్ష రాసేందుకు వీలవుతుంది.

సమర్థవంతంగా నిర్వహిస్తాం

సీస్‌ సర్వేలో భాగంగా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. సర్వేను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల (ఎఫ్‌ఐ) నియామకానికి కూడా చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే ఎఫ్‌ఐలకు శిక్షణనిస్తాం.

–జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ,

కాకికాడ

అవగాహన అంచనాకు..

నాస్‌, సీస్‌ సర్వేల ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపు జరుగుతుంది. విద్యార్థుల్లో అవగాహనా శక్తిని అంచనా వేసేందుకు సర్వే ఉపకరిస్తుంది. సర్వే ఫలితాలను బట్టీ తగిన బోధనాభ్యసన ప్రణాళికలను రూపొందిస్తారు. సర్వేను జిల్లా కమిటీ పర్యవేక్షిస్తుంది.

–ఎం.కమలకుమారి,

డీఈఓ, అమలాపురం

సర్వే ఎలా చేస్తారంటే..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 976 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 926, కాకినాడ జిల్లాలో 1,013 పాఠశాలలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో అభ్యసన ఫలితాలు (లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌) పేరుతో సర్వే చేపట్టనున్నారు. సర్వేలో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పరీక్ష ద్వారా మదింపు చేయనున్నారు. ఇందుకు పక్కాగా పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో విద్యా శాఖ నిమగ్నమైంది. పరీక్ష నిర్వహణకు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు (ఎఫ్‌ఐ)లను ఎంపిక చేయనున్నారు. కోనసీమ జిల్లాకు డైట్‌, బీఎడ్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, పీజీ విద్యాభ్యాసం చేస్తున్న 1,075 మంది ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యవేక్షకులు (ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌)గా నియమించనున్నారు. అలాగే కాకినాడ జిల్లాకు 1,116, తూర్పుగోదావరి జిల్లాకు 1,020 మందిని ఎంపిక చేస్తారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement