పత్తి అమ్మకాలకు దళారులను ఆశ్రయించవద్దు | Sakshi
Sakshi News home page

పత్తి అమ్మకాలకు దళారులను ఆశ్రయించవద్దు

Published Tue, Nov 21 2023 2:08 AM

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అంబటి రాంబాబు  - Sakshi

సత్తెనపల్లి: దళారులను ఆశ్రయించకుండా పత్తి పంట సాగు చేసిన రైతులే నేరుగా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్‌ పెండెం బాబూరావు అధ్యక్షత వహించారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రంలోనూ, ఈ– క్రాప్‌ బుకింగ్‌లోనూ పేరు నమోదు చేసుకున్న రైతులే నేరుగా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో తమ పంటను విక్రయించుకోవచ్చునన్నారు. పంట నాణ్యతను బట్టి ధర లభిస్తుందని చెప్పారు. కనీస మద్దతు ధరగా క్వింటాకు రూ.7,020గా ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. తొలుత సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పత్తిని పరిశీలించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి రైతుల పత్తిని కొనుగోలు చేయాలని బయ్యర్‌ రవిప్రసాద్‌కు సూచించారు. దళారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా పర్యవేక్షణ చేయాలని మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎస్‌ఎం ఇస్మాయిల్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నాయకుడు పక్కాల సూరిబాబు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కళ్లం శివరామిరెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రమావత్‌ కోటేశ్వరరావు నాయక్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యుడు కళ్లం విజయభాస్కర్‌ రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు వైడ్యూర్య, దేవరశెట్టి రవికుమార్‌, విజయలక్ష్మి, ఆళ్ల జగ్గయ్య, నాయకులు ఎంజేఎం రామలింగా రెడ్డి(చిన్నా), తాళ్లూరి మోహన్‌బాబు ఉన్నారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Advertisement
Advertisement