దక్షిణాదిపై ‘ఆప్‌’ నజర్‌

13 Mar, 2022 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌లో అఖండ విజయం తాలూకు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత సోమనాథ్‌ భారతి చెప్పారు. పంజాబ్‌లో గెలుపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆప్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. 

ఆయా రాష్ట్రాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. మార్పు కోరేవారంతా ఆప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో దశల వారీగా పాదయాత్రలు సైతం చేపట్టాలని నిర్ణయించినట్లు సోమనాథ్‌ భారతి పేర్కొన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14 నుంచి పాదయాత్రలకు శ్రీకారం చుడతామని వివరించారు. పాదయాత్రలో తొలి అడుగు తెలంగాణలోనే వేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు