ఎన్డీయేలోకి శరద్‌ పవార్‌..? తాజా భేటీ ఎందుకు..?

13 Aug, 2023 10:25 IST|Sakshi

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు జరుగుతున్నాయి.  రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరత్ పవార్‌ను కలవడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. శరద్ పవార్‌ కూడా బీజేపీతో చేతులు కలపనున్నారా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. అజిత్ పవార్ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిపోయిన విషయం తెలిసిందే.  

రాష్ట్రంలో కోరేగావ్ పార్క్‌లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త అతుల్ చోర్డియా ఇంట్లో అజిత్, శరద్ పవార్లు అరగంటపాటు చర్చలు జరిపారని సమాచారం. ఈ సమావేశంలో శరద్ పవార్ ముఖ్య అనుచరుడు జయంత్ పాటిల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

భేటీలో చర్చ దేనిపై..?
ఎన్సీపీలో ఇటీవల చీలికలు వచ్చి మహారాష్ట్ర రాజకీయంలో కీలక మలుపులు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల అనంతరం ఇప్పటికే అజిత్, శరద్ పవార్లు పలుమార్లు కలిశారు. కానీ ప్రస్తుతం ఎందుకు కలిశారనే విషయం మాత్రం అధికారికంగా తెలియదు. తాజాగా బెయిల్‌పై బయటికి వచ్చిన నవాబ్ మాలిక్, ఎన్డీయేలో అజిత్ పాత్రకు సంబంధించిన  అంశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. 

శరద్‌ పవార్‌ను కూడా ఎన్డీయేలో కలిసే విధంగా అజిత్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ జయంత్ పాటిల్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే పార్టీని వీడేవారు బీజేపీతో కలిసే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. 

ఈ నెలఖరున మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఇండియా కూటమి ముంబయిలో సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిని ఇరుకున పెట్టే విధంగా ఏదో ఒక మార్పు చేయాలని అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవల జయంత్ పాటిల్‌ కూడా ఎన్డీయేలో కలిసిపోతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: Independence Day: సైనిక దళాల డ్రస్ రిహార్సల్‌.. రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు..

మరిన్ని వార్తలు