కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటి: అమిత్‌ షా

31 Dec, 2022 21:17 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు పొత్తులపై కసరత్తు చేపట్టాయి. అయితే, అధికార బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని కుండబద్దలు కొట్టారు కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా. రాష్ట్రంలో మూడింట రెండొంతులు మెజారిటీ సాధించి అధికారం చేపట్టేందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. జేడీ(ఎస్‌)కి ఓటేస్తే అది కాంగ్రెస్‌కు వేసినట్లేనని చెప్పారు. 2023లో పార్టీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందన్నారు. 

‘కర్ణాటకలో ఈసారి త్రిముఖ పోరు ఉంటుందని జర్నలిస్టులు చెబుతున్నారు. కానీ, నేను ఈసారి ముఖాముఖి పోటీనే ఉండబోతుందని అంటున్నా. ఎందుకంటే జేడీఎస్‌కు ఓటేసినా అది కాంగ్రెస్‌కు వేసినట్లే అవుతుంది. బీజేపీ నేతృత్వంలోని దేశభక్తులకా? దేశాన్ని విభజించే కాంగ్రెస్‌ నేతృత్వంలోని తుక్డే తుక్డే గ్యాంగ్‌కా? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ప్రజలే తేల్చుకోవాలి.’అని ప్రజలను కోరారు అమిత్‌ షా. బీజేపీ తమతో పొత్తు పెట్టుకోబోతోందటూ జేడీఎస్‌ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు షా. ఒంటరిగానే పోటీ చేసి ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్‌’కి కేంద్రం హెచ్చరిక! 

మరిన్ని వార్తలు