సర్ మా ఇంటికి డిన్నర్‌కు వస్తారా? సీఎంను అడిగిన ఆటోడ్రైవర్‌

12 Sep, 2022 17:42 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఆప్ విజయం కోసం ఆటోవాలాలు తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో లాగా గుజరాత్‌లోనూ ఆప్ కోసం ప్రచారం నిర్వహించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.

అయితే ఈ సమావేశంలో ఓ ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి డిన్నర్‍కు రావాలని ఆహ్వానించాడు. పంజాబ్‌లో ఓ ఆటోవాలా ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేసిన వీడియో తాను చూశానని, ఇప్పుడు తన ఇంటికి కూడా డిన్నర్‌కు వస్తారా? అని అతను అడిగాడు. 

దీనికి స్పందించిన ఢిల్లీ సీఎం.. వెంటనే తాను డిన్నర్‌కు వస్తానని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లుకొట్టారు. అయితే తనను తీసుకెళ్లేందుకు హోటల్‌కు రావాలని ఆటోడ్రైవర్‌కు కేజ్రీవాల్ సూచించారు. తనతో పాటు మరో ఇద్దరు ఆప్‌ నేతలు కూడా వస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఏ సమయానికి డిన్నర్‌కు రావాలని కూడా ఆటో డ్రైవర్ను అడిగారు. ఆ తర్వాత రాత్రి 8గంటలకు టైంను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

చదవండి: కాంగ్రెస్‌ షేర్‌ చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నిక్కర్‌ ఫోటోపై తీవ్ర దుమారం

మరిన్ని వార్తలు