గిరిజన సమస్యలపై సీఎంకు చిత్తశుద్ధి లేదు 

10 Aug, 2020 03:21 IST|Sakshi
ట్యాంక్‌బండ్‌ వద్ద కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బాబూమోహన్‌ తదితరులు  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కవాడిగూడ (హైదరాబాద్‌): రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. ఆదివాసీలను ఓట్ల కోసం వాడుకుని మోసం చేశారన్నారు. జీవో నంబర్‌ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, మాజీ ఎంపీ అమర్‌సింగ్, మాజీ మంత్రి బాబూమోహన్, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌ నాయక్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌కుమార్, దేవేందర్, బంగారు శ్రుతి, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కుతాడి కుమార్, లోకిని రాజులు హాజరై కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు